రాంచీ, ఆగస్టు 15: కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత నెలలో సీజేపీ ఆందోళన నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచింది. అదే తరహాలో జార్ఖండ్లో కూడా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఇక్కడ జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఢిల్లీలో విద్యార్థి ఉద్యమాన్ని వ్యతిరేకించిన బీజేపీ ఇక్కడ ప్రత్యక్షంగా సహకరిస్తున్నది. జంతర్ మంతర్ ఆందోళన చివరి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటిని ముట్టడించి హడావిడి చేశారు. కానీ చిత్రంగా జార్ఖండ్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఆయన ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం.
తద్వారా అటు ప్రధాని మోదీ, ఇటు విపక్ష నేత రాహుల్ గాంధీలు తమ స్వప్రయోజనాల దగ్గరకు వచ్చేటప్పటికీ దొందూదొందే అని ఈ విద్యార్థి ఉద్యమాల విషయంలో నిరూపించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన ముగిసిన నాలుగు రోజుల తర్వాత జూలై 29లో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో యువత ఆందోళన ప్రారంభించింది. ఇక్కడ వారు సీజేపీ మాదిరిగానే తమ ఆందోళనను నిర్వహించారు. ఈ రెండు ఉద్యమాలను పక్కపక్కన పెట్టి చూస్తే మనకు పలు పోలికలు కన్పిస్తాయి. ఢిల్లీలో సీజేపీ చలో పార్లమెంట్ నిర్వహించగా, ఇక్కడ అసెంబ్లీకి ప్రదర్శన జరిపారు. ఢిల్లీ తరహాలోనే జార్ఖండ్లో కూడా విద్యారులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జీ చేయడంతో పాటు, టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ రెండు ఆందోళనల్లోనూ విద్యార్థులు దీక్షకు కూర్చున్నారు. విద్యార్థి నేత దేవేంద్ర మెహతో నేతృత్వంలో జార్ఖండ్లో ఐదుగురు దీక్షకు దిగారు.
మీడియా విభిన్న తీరు
దేశంలో జరిగిన ఈ రెండు ఉద్యమాలపై మీడియా తీరు కూడా భిన్నంగా ఉంది. జంతర్ మంతర్ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ మద్దతు చానల్స్ అస్సలు పట్టించుకోలేదు. అవే చానళ్లు రాంచీ విషయానికి (అది ప్రతిపక్ష రాష్ట్రం కాబట్టి) వచ్చేటప్పటికీ విద్యార్థుల ఆందోళనను లైవ్లో ప్రసారం చేశాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఇంటర్వ్యూలను తరచూ ప్రసారం చేశాయి. జూలై 20న ఢిల్లీ లాఠీచార్జీకి బాధ్యులెవరో చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నా సభకు హాజరు కాని హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగుస్తున్న సమయంలో సభకు వచ్చి తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్ వెలుపల ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ చర్చలకు రాకుండా పారిపోతున్నారంటూ ఎన్డీఏ మంత్రులు విమర్శలు చేశారు. అప్పటివరకు విపక్షాలు అమిత్ షా రావాలి.. సభలో మాట్లాడాలని డిమండ్ చేయగా, తర్వాత అధికార పక్షం రాహుల్.. పారిపోవద్దు.. చర్చకు రా అని సవాల్ విసరడం గమనార్హం.
నేడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
తమ ఆందోళనలో భాగంగా ఆదివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని యువత ప్రకటించింది. అధికార జేఎంఎంకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామాను డిమాండ్ చేసింది. ఈ నెల 20న ఆయన ఇంటిని ముట్టడిస్తామని తెలి పింది. కాగా విద్యార్థులు శనివారం తిరంగా యాత్రను నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు చేపట్టి వేలాది మంది యువత, ప్రజలు నినాదాలు చేస్తూ ఈ యాత్రలో పాల్గొన్నారు. కేవలం బ్రిటీష్ వారి నుంచి స్వేచ్ఛ లభించడమే స్వాతంత్య్రం కాదని, అవినీతి, అన్యాయం నుంచి స్వేచ్ఛ లభించడం కూడా స్వాతంత్యమేనని యువత నినదించింది. కాగా, ర్యాలీలో పాల్గొనేందుకు సదర్ దవాఖాన నుంచి బయటకు వెళ్లడానికి పోలీసులు అంగీకరించ లేదని గత 14 రోజుల నుంచి దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా నేత దేవంద్ర మెహతా, ఇతర నేతలు ఆరోపించారు.