Land Grabbing | బంజారాహిల్స్, జనవరి 19: ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని ఎలాగైనా కాజేసేందుకు కొంతమంది ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది తమ ఇంటికి వెనకాలే ఖాళీగా స్థలం కనిపిస్తే ఊరుకుంటామా అంటూ.. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని తెలివిగా కాజేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వెనకాల పార్కింగ్ స్థలం ఉంది. దీన్ని ఆనుకుని సుమారు 400 గజాల జీహెచ్ఎంసీ పార్కు స్థలం చాలా ఏండ్లుగా ఖాళీగా ఉంది. కాగా, ఈ పార్కు స్థలానికి ఆనుకుని ఉన్న ప్లాట్ నం. 457లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన గెస్ట్ హౌజ్ ఉంది. తమ గెస్ట్ హౌజ్ వెనకాల చాలా కాలంగా ఖాళీగా కనిపిస్తున్న స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్న సదరు నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు జీహెచ్ఎంసీ పార్కును తాము అభివృద్ధి చేస్తామని స్థానిక యూబీడీ విభాగం అధికారులను నమ్మించారు. సీఎస్ఆర్ కింద పార్కు చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని, పార్కులో పచ్చదనం పెంచుతామంటూ చెప్పారు. రాళ్లు రప్పలతో ఉన్న పార్కు స్థలాన్ని అభివృద్ధి చేస్తారని భావించిన స్థానిక యూబీడీ విభాగం అధికారులు.. ఇందుకు అంగీకరించారు.
రూ. 12 కోట్ల విలువ..
పార్కు స్థలాన్ని చదును చేసిన సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులు.. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలోకి గేటును సైతం ఏర్పాటు చేశారు. స్థలం లోపల, బయట జీహెచ్ఎంసీ పార్కు అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకూ అంతా సక్రమంగానే సాగింది. అయితే ఏడాది కిందట ప్రభుత్వం మారడంతో సదరు నిర్మాణ సంస్థకు ఈ పార్కు స్థలాన్ని కాజేయాలన్న ఆలోచన వచ్చింది. పార్కు అభివృద్ధిని పక్కన పెట్టి స్థలంలో కూరగాయలు పండించడం ప్రారంభించారు. తమ గెస్ట్ హౌజ్ నుంచి గేటు ఏర్పాటు చేసుకుని ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. పీఎస్ పక్కనున్న ఖాళీ స్థలంలోకి వచ్చేలా ఏర్పాటు చేసిన మెట్లను తొలగించారు. బయటి భాగంలో ఉన్న జీహెచ్ఎంసీ బోర్డును సైతం తొలగించారు. సుమారు రూ.12కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించుకున్న సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకుని పార్కు స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.