Crime News | దుండిగల్,ఆగస్టు 3: ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
బాచుపల్లి సీఐ ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ జర్నలిస్ట్స్ కాలనీలో సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న గుంటూరు వెంకట్రావు తన భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా జూలై 26న భార్య రాజ్యలక్ష్మితో కలిసి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. అయితే బెడ్రూంలోని సెల్ఫ్‌లో రూ.600 కనిపించకపోవడంతో రాజ్యలక్ష్మి, బీరువా తెరిచి చూడగా 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా బాచుపల్లి సీఐ ఉపేందర్‌రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, క్రైమ్ టీమ్ సహాయంతో ప్రగతినగర్‌లోని బంగారు షాపు దగ్గర బీట్ నిర్వహిస్తుండగా శనివారం ఉదయం 10గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక బ్యాగు పట్టుకుని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ కనిపించారు. అనుమానం వచ్చి బ్యాగును చెక్ చేయగా అందులో బంగారు నగలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు విచారించగా జర్నలిస్ట్స్ కాలనీలోని తాము కిరాయికి ఉంటున్న ఇంట్లోనే బంగారు నగలు దొంగలించినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితులు బడుగు జ్యోతి, జంపని చైతన్య కుమార్‌లుగా గుర్తించారు. కేసును ఛేదించిన బాచుపల్లి సీఐ ఉపేందర్‌రావు, డీఐ తిమ్మప్పతో పాటు క్రైం టీం సిబ్బందిని కూకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు.