మెహిదీపట్నం జూలై 9: చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ వైభవంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివ సత్తుల శిగాలు, యువకుల కేరింతలతో మహిళలు బోనాలు తీసుకువెళ్లి జగదాంబిక ఎల్లమ్మకు సమర్పించారు. అలాగే తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పించారు.
ఆదివారం కావడంతో నగరం నుంచే కాకుండా, శివారు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో గోల్కొండ చుట్టుపక్కల రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోటలో బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ఆరో బోనం పూజల్లో భాగంగా అమ్మవారికి ఉదయం అర్చన చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస్‌రాజు, పూజారి సర్వేశ్వర్ చారి, సభ్యులు భక్తులకు సేవలను అందజేశారు. అదే విధంగా మహంకాళి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకున్నారు. కులవృత్తుల సంఘం అధ్యక్షుడు బి.సాయిబాబా చారి, ఆలయ పూజారి సురేశ్ చారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. కోటలో బోనాల సందర్భంగా శాంతిభద్రతల పరంగా సమస్యలు తలెత్తకుండా దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్ పర్యవేక్షణలో ఏసీపీ సతీశ్ , కోటేశ్వర్రావు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.