సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ టు సైబరాబాద్ భలే డిమాండ్ గురూ’ అంటూ నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి సైబరాబాద్‌కు 32మంది సబ్ఇన్స్పెక్టర్లను కేటాయించే క్రమంలో జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించగా వారికి కమిషనరేట్‌లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఒక డీసీపీ నేనున్నానంటూ భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
నార్సింగి, పటాన్చెరు, రాయదుర్గం, దుండిగల్ వంటి ముఖ్య ప్రాంతాల్లో పోస్టింగులంటే తమకు పండుగేనంటూ ముడుపులు చెల్లించుకుని వచ్చిన ఎస్ఐలు చర్చించుకుంటున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో ఏ ఇద్దరు పోలీసులు కలిసినా దీనిగురించే మాట్లాడుకున్నారు. అసలు ఎవరు ఎవరికి డబ్బులిచ్చారు.. కేటాయింపులు జరిగిన వారిలో ఏ బ్యాచ్‌కు సంబంధించిన ఎస్ఐలు ఈ మొత్తం లాబీయింగ్‌లో భాగస్వాములయ్యారోనంటూ ఆరా తీశారు. అయితే ఇన్స్పెక్టర్ల బదిలీల సందర్భంగా రాజకీయంగా రచ్చ జరగడంతో పాటు బదిలీల జాబితా విడుదల చేసి ఆ వెంటనే ఆపేయాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఎస్ఐల కేటాయింపులు, సరెండర్లపై కూడా రచ్చ జరుగుతోంది.
సీపీ కార్యాలయంలో చర్చ..!
నమస్తే కథనాన్ని ముందు పెట్టుకుని సీపీ కార్యాలయంలో సీపీ రమేశ్‌తో పాటు పలువురు డీసీపీలు అంతర్గతంగా చర్చించినట్లు సమాచారం. కమిషనరేట్‌లో జరిగిన బదిలీలు, సరెండర్లు, కేటాయింపులు ఇంతగా అప్రతిష్టకు గురిచేస్తాయని తాను అనుకోలేదంటూ సీపీ రమేశ్ డీసీపీల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కేవలం ఉద్యోగుల కొరత కారణంగా తాము ఈ బదిలీలు చేపట్టినట్లు చెబుతున్నప్పటికీ సీఎం సన్నిహితులైన వారి ద్వారా కమిషనరేట్‌లో చక్రం తిప్పుతున్న ఒక డీసీపీ కారణంగానే ఇదంతా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సైబరాబాద్‌లో ఆ డీసీపీ చక్రం తిప్పితే, హైదరాబాద్‌లో ఒక సీసీ, ఒక సాంకేతిక ఇన్స్పెక్టర్ చక్రం తిప్పారని, వీరు చెప్పిన వారికే పోస్టింగులు వచ్చాయని, ఇదంతా గతంలో హైదరాబాద్‌లో చేసి ప్రస్తుతం సైబరాబాద్‌లో కీలక పోస్టింగ్ పొంది మళ్లీ ఆగిపోయిన ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు రెండు కమిషనరేట్లలో పోలీసులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఐదారుగురు అధికారుల కారణంగా ఇరు కమిషనరేట్ల ఉన్నతాధికారులకు బదిలీల వ్యవహారం తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే మరికొందరు సబ్ఇన్స్పెక్టర్లు సైబరాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు ఏదైనా రూట్ ఉంటే చూడమంటూ జాబితాలో ఉన్న ఎస్ఐలను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఇంతకూ సైబరాబాద్ ఎందుకంతగా ఇష్టపడుతున్నారని అడిగితే హైదరాబాద్ సిటీలో ఇరవై ఏళ్లు పనిచేసిన ఇన్స్పెక్టర్ సైబరాబాద్ కమిషనరేట్‌లో మూడేళ్లు పనిచేస్తే చాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంత డిమాండ్ ఉన్న పోస్టుల విషయంలో హైదరాబాద్ టు సైబరాబాద్ మారిన ఎస్ఐలలో, హైదరాబాద్‌తో సహా పలుచోట్ల నుంచి పోస్టింగ్ ఇచ్చిన ఇన్స్పెక్టర్లలో ఎప్పుడెప్పుడు తమ పోస్టులు ఖరారవుతాయనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఎస్ఐలకు సంబంధించి మరో జాబితా కూడా తయారవుతున్నదని ఆ ఇద్దరు ఎస్ఐలు ప్రచారం చేశారు.
దీనిపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. మరోవైపు మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు వసూలు చేశారంటూ జరుగుతున్న చర్చ, వార్తాకథనాలపై ఇంటిలిజెన్స్, ఎస్బీలు కేటాయించబడిన ఎస్ఐలలో కొందరితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే వారెవరూ తామెవరికీ డబ్బులు ఇవ్వలేదని, తమను విల్లింగ్ ఉందా అని అడిగితే వస్తామని చెప్పామంటూ సమాధానమిచ్చినట్లు సమాచారం. అయితే ఈ 32 మందినే ఎందుకు విల్లింగ్ అడిగారని, హైదరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్‌కు వస్తామంటూ 100 మందికి పైగా ఎస్ఐలు విల్లింగ్తో ఉంటే వారికెవరికీ సమాచారం లేకుండా వీరికే ఎలా తెలిసిందంటూ హైదరాబాద్ ఎస్ఐలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా లోపలలోపల గప్‌చుప్‌గా ఓ సైబరాబాద్ డీసీపీ నేతృత్వంలో ఓ ఇన్స్పెక్టర్ తనకు సన్నిహితమైన ఇద్దరు ఎస్ఐలతో కలిసి చేశారని వారే చెప్పుకుంటున్నారు.
సైబరాబాద్ టు హైదరాబాద్ ఎస్సైలలో ఆందోళన..!
సైబరాబాద్ టు హైదరాబాద్ సరెండర్ల వేటు ప్రధానంగా 2012, 2014, 2020 బ్యాచ్‌లకు చెందిన ఎస్ఐలపై పడింది. దశాబ్ధకాలంగా ఒకే కమిషనరేట్‌లో పనిచేస్తూ తమ పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల వైద్యం కోసం స్థానికంగా స్థిరపడిన వారు ఇప్పుడు మూటాముల్లె సర్దుకోవలసి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా అవినీతి ఆరోపణలు లేదా పనితీరు సరిగ్గా లేకపోతే పోలీసులను అదే యూనిట్‌లోని లూప్‌లైన్ విభాగాలకు మారుస్తారు. కానీ ఇలా సామూహికంగా యూనిట్లు మార్చడం వెనక ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
ఈ గందరగోళ పరిస్థితిపై సైబరాబాద్ నుంచి రిలీవ్ అయిన 32మంది ఎస్ఐలు హైదరాబాద్ కమిషనరేట్‌లో రిపోర్టు చేసిన తర్వాత తమ గాడ్ఫాదర్లను పట్టుకుని తక్షణమే తమ బదిలీ ఉత్తర్వులు నిలిపివేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఎస్ఐల మీద కూడా ఒక రకమైన అభిప్రాయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సక్రమంగా పనిచేయనివారిని గత కొన్నిరోజులుగా ఎంపికచేసి వారిని చార్మినార్ జోన్‌కు సరెండర్ చేసినట్లుగా ఒక పోలీసు అధికారి చెప్పారు. అయితే ఎస్ఐలు మాత్రం కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా బదిలీచేసిన చోటుకు వెళ్లిపోవాలని ఆదేశించడం, ఎస్హెచ్ఓలపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేసి తమను రిలీవ్ చేయడం వెనక మతలబేంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు.