Hyderabad | సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రాటెజిక్ రెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మరో పని పూర్తయింది. 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు వచ్చే దారిలో ఎల్బీనగర్ కూడలిలో కుడివైపు నిర్మితమైన వంతెన ప్రారంభానికి సిద్ధమైంది.
22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్లు వెడల్పుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ నెల 13న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 16న కౌంటింగ్ జరగనుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మార్చి 18 తర్వాత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.