సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో గ్రేటర్‌లోని కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థల ప్రతినిధులు, కేబుల్ టీవీ అసోసియేషన్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఇటీవల జరిగిన 11 కేవీ ఫీడర్ సర్వేలో చాలా వరకు ఉపయోగంలో లేని కేబుళ్లు పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. కొన్ని చోట్ల స్తంభం మొత్తం కేబుళ్లతో చుట్టి ఉండటం వల్ల విద్యుత్ సిబ్బందికి పోల్స్‌పై మరమ్మతులు చేయాలంటే సమస్యలు వస్తున్నాయని సీఎండీ చెప్పారు.
నగరంలోని ప్రధాన రహదారుల్లో వారం లోగా, ఇతర ప్రధాన రహదారుల్లో రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుళ్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. ప్రస్తుతం విద్యుత్ స్తంభాలపై ఉపయోగంలో లేని కేబుళ్లు, ఇతర వస్తువులను సైతం తొలగించి.. ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని ప్రతినిధులను ఆదేశించారు. సమావేశంలో టీజీఎస్పీడీసీఎల్ ఇన్చార్జి డైరెక్టర్లు రాములు, సుధారాణి, జోనల్ చీఫ్ ఇంజినీర్ సాయిబాబా, ఇంటర్నెట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.