సిటీబ్యూరో: వాతావరణంలో విభిన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి..క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. వివిధ పనుల కోసం రోడ్లపైకి వచ్చిన పౌరులు జోరు వానలో చిక్కుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల కష్టాలను తొలగించేందుకు ముందస్తు సమాచారం చేరవేర్చేందుకు బల్దియా సిద్ధమైంది. పౌరులకు సకాలంలో కురవబోయే వర్ష తీవ్రత (రెడ్, ఆరెంజ్, ఎల్లో) కేటగిరీల వారీగా సమాచారం చేరవేర్చి అప్రమత్తం చేయనున్నది.
తద్వారా పౌరులతో పాటు ఇటు ఆయా శాఖలకు సహాయక చర్యలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉంటుంది. దీంతో వరద నష్ట నివారణ గణనీయంగా తగ్గింవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులను సమన్వయం చేస్తూ ముగ్గురు ప్రత్యేక అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వాతావరణ సూచనల ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండి సంస్థ పరిధిలో రికార్డుల్లో ఉన్న 19 లక్షలకు పైగా ఆస్తి పన్ను చెల్లింపులుదారుల (కుటుంబ యాజమానులు) ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో వాతావరణ సందేశాన్ని పంపించనున్నారు.