మేడ్చల్,/జవహర్‌నగర్ మే 8 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌కు వెళ్లిన పర్యాటకులను కాల్చి చంపడం దారుణమన్నారు. భారత మహిళల నుదుట సిందూరాన్ని తుడిపేసిన ఉగ్రమూకలపై జరిగిన దాడిలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించడం దేశానికే గర్వకారణమన్నారు. వారిని ప్రతి మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ జెండాను చేత పట్టుకొని, దేశానికి, సైనికులకు అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవీలత, అధ్యాపకులు, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఉగ్రవాదాన్ని సహించం..
ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో తుద ముట్టించడం హర్షణీయమని, ప్రపంచ మానవాళి ఉగ్రవాదాన్ని సహించదని అంతం కావాల్సిందేనని మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మేయర్ కావ్య సమక్షంలో జవహర్‌నగర్ కార్పొరేషన్లో సీఎంఆర్ దవాఖాన నుంచి అంబేద్కర్ ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు లలితాయాదవ్, సంగీత, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్‌చారి, సోషల్ మీడియా కన్వీనర్ అహ్మద్‌పాషా, నాయకులు మహేశ్, కాసీం, సిద్ధులుయాదవ్, వెంకటేశ్‌గౌడ్, శోభ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.