సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టులను ప్రతిపాదించాలి… భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి… ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి… కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేస్తున్న హడావుడి మాత్రం అంచనాలకు మించిపోతున్నది. ఇప్పటివరకు ప్రతిపాదించిన ప్రాజెక్టులు కాగితాలు దాటకముందే, అనుమతులు, డిజైన్లు ఖరారు చేసి, టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు పనులన్నీ కట్టబెట్టడం వరకు చకచకా సాగిపోతున్నాయి. ఆ తర్వాత భూసేకరణలో బాధితులు చెప్పే అభ్యంతరాలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి.
వందలాది కేసులు.. అయినా..
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఈ రెండు కీలక ప్రాజెక్టుల విషయంలో వందలాది మంది కోర్టులను ఆశ్రయించి, ప్రాజెక్టులకు భూములు ఇచ్చే అంశంలో వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో మాత్రం హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించడం, వాటిని ఖరారు చేసి కంపెనీలకు కట్టబెట్టడం సర్వసాధారణంగా మారింది. ప్రాజెక్టులకు అవసరమైన భూములు లేకుండానే ప్రాజెక్టులకు టెండర్లను పిలిచి జనాలను మభ్యపెడుతుందే తప్ప.. ప్రతిపాదనల్లో ఎలాంటి పురోగతి ఉండటం లేదని రావిర్యాల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 విషయంలోనే తేటతెల్లమైంది. ఈ ప్రాజెక్టు కోసం వందలాది ఎకరాల పంట పొలాలను లక్ష్యంగా చేసుకుని భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టింది.
అదే సమయంలోనే టెండర్లు ఖరారు చేసి ఓ వివాదాస్పద కంపెనీకి పనులు కూడా అప్పగించింది. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై హైకోర్టులో వాదనలను బాధితులు వినిపిస్తూనే ఉన్నారు. ఇక ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు అంశంలో ఏకంగా 1000 మంది ప్రాజెక్టుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించి, వారి ఆస్తులకు రక్షణ పొందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మరోసారి టెండర్లు ఖరారు చేసి, ఓ కంపెనీకి కట్టబెట్టే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్డింగ్‌లను కొలిక్కి తీసుకు రానున్నారు. ఇలా ప్రాజెక్టుల విషయంలో టెండర్లతో బాధితులను ఆందోళనకు గురి చేస్తోంది. కోకాపేట నుంచి పరిగి వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలోనూ హెచ్ఎండీఏకు రైతుల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లతో ఒరిగేదేమీ లేదని చెబుతున్నా… అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని చెప్పి… టెండర్లు ఆహ్వానించే పనిలో అధికారులు ఉన్నారు.
భూములు ఇచ్చేది లేదని చెబుతున్నా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే శామీర్‌పేట-జేబీఎస్, ఎగ్జిట్ నంబర్..13 నుంచి ఫ్యూచర్ సిటీ వరకు, కోకాపేట నుంచి పరిగి మండలం చిట్యాల వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను వేల కోట్ల రూపాయల అంచనాతో నిర్మించేందుకు ప్రతిపాదించింది. అవసరమైన భూముల సేకరణ జరగకుండానే, హెచ్ఎండీఏ మాత్రం టెండర్లు ఖరారు చేసే పనిలో ఉంది. ప్రధాన ప్రాజెక్టుల విషయంలో వందలాది మంది జనాలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టులోని లోపాలు, విధానపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత నష్టపరిహారం విషయంలో భూములు ఇచ్చేది లేదని చెబుతున్నారు.