Summer | సిటీబ్యూరో: మార్చి నెలలోనే ఎండలు ముదురడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 42 నుంచి 44వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఎండ తీవ్రత వల్ల నగరంలో వడ దెబ్బ బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా నవజాత శిశువులు, ఐదేండ్ల లోపు చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు బీపీ, షుగర్, కిడ్నీ, కాలేయ, గుండె, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చికిత్స చేయించాలి..
వడదెబ్బకు గురైన వారు.. ఎండలో తిరిగి మూర్చపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. ముఖంపై స్వచ్ఛమైన నీటిని చల్లి, స్పృహ వచ్చిన తరువాత నెమ్మదిగా కొంత చల్లటి మంచినీరు తాగించాలి. వెంటనే దగ్గరలో ఉన్న దవాఖానకు తరలించి చికిత్స చేయించాలి.
– డా.కిరణ్ మాడాల, గాంధీ దవాఖాన క్రిటికల్ కేర్ నిపుణులు
కాటన్ దుస్తులు వేయాలి..
మధ్యాహ్నం సమయంలో పిల్లలను తీసుకుని తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వాహణాలను ఆశ్రయించడం ఉత్తమం. పిల్లలకు కాటన్ దుస్తులు మాత్రమే వేయాలి. నవజాత శిశువులతో పాటు మూడేండ్ల లోపు శిశువులకు తరచూ తల్లిపాలు పట్టాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు ఇవ్వడం మంచిది.
– డా.ఉషారాణి, ప్రొఫెసర్ ఆఫ్ పిడియాట్రిక్, నిలోఫర్ హాస్పిటల్