బడంగ్‌పేట, ఏప్రిల్ 15: వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రామిడి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన మళ్లీ ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై పన్నుల భారం మాత్రం మోపుతున్నారని మండిపడ్డారు. హామీలు ఇవ్వకుండానే పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. హామీలు ఇచ్చి నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అని పడిపోయిందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్‌పై ఆధారపడి బతుకుతున్న ఎంతోమంది యువత బతుకు బుగ్గి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కదలించినా, కూలీలను కదిలించినా, ఏ వ్యాపారిని తట్టినా కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఎవరికీ పని లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏమైపోతుందో కూడా ముఖ్యమంత్రికి సోయి లేదని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాలను తిట్టుడే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
ఇప్పటికీ కేసీఆర్ పథకాలే ప్రజలకు గుర్తున్నాయి
రాష్ట్రంలో ఇప్పటికీ కేసీఆర్ పథకాలే ప్రజలకు గుర్తున్నాయని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంచి నీళ్లు వస్తుంటే కేసీఆర్ నీళ్లు అంటున్నారని ఆమె గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమం అనగానే కేసీఆర్ నాటిన చెట్లు అంటున్నారన్నారు. పింఛన్లు వస్తున్నాయా అని అడిగితే కేసీఆర్ పైసలని గుర్తు చేయడం జరుగుతుందన్నారు. రైతు బంధు గురించి అడిగినా కేసీఆర్ పేరే గుర్తు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ పేరు లేకుండా చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల గుండెలలో కేసీఆర్ సుస్థిరంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ వెంట నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని సబండవర్గాలు కోరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ పాలనే కావాలంటున్నారని ఆమె తెలిపారు.
రజతోత్సవాలకు పోలీసుల ఆంక్షలు
ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న రజతోత్సవానికి ప్రజలు వెళ్లకుండా పోలీసులు అనేక ఆంక్షలు పెడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువమంది గుమిగూడకూడదని షరతులు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించుకుంటున్న సభకు పోలీసులు ఆంక్షలు పెట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వాహనాలను కూడా అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపించబోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రజతోత్సవాలకు కదలిరండి:
ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవాలకు ప్రతి పల్లె నుంచి, ప్రతి బస్తీ నుంచి ప్రజలు తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి గూడెంకి, ప్రతి బస్తీకి రజతోత్సవ పోస్టర్లు వెళ్లాలన్నారు. గోడలకు రజతోత్సవాల గురించి వాల్ రైటింగ్ రాయించాలన్నారు. ప్రతి బస్తీ నుంచి, ప్రతి పల్లె నుంచి బస్సులు కదలాలని సూచించారు. కేసీఆర్‌ను చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని అన్నారు.