Ration Cards | మేడ్చల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం లక్ష 22 వేల దరఖాస్తులు వస్తే నామ మాత్రంగా 6,700 వందల రేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారు.ఈ క్రమంలో మిగతా దరఖాస్తుదారుల్లో వివిధ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నా..రేషన్ కార్డులు అందక తమకు సంక్షేమ పథకాలు ఎలా దక్కుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి సుమారు 13 నెలలు పూర్తయిన దరఖాస్తుదారులకు రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవద్దని నిరుపేదలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దరఖాస్తుదారులకు విచారణ పేరిట రేషన్ కార్డులు అందించడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రేషన్‌కార్డుల ద్వారా అందే ఆరోగ్య సేవలు, గృహజ్యోతి, రాయితీ వంట గ్యాస్, రాజీవ్ యువ వికాస్ పథకం, ఇతర పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికం. దీంతో ఈ పథకాలకు అర్హ్హులుగా ఉండి రేషన్ కార్డులు లేకుంటే ఈ పథకాలకు కనీసం దరఖాస్తులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.