తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలు సంబురంగా సాగాయి. సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మేడ్చల్ జిల్లా మజీద్‌పూర్, అలియాబాద్ గ్రామాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం వల్లే పల్లెలకు మహర్దశ వచ్చిందన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చెప్పారు. అలాగే వేడుకల సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అభివృద్ధి నమూనాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మేడ్చల్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మజీద్‌పూర్, అలియాబాద్ గ్రామాలలో గురువారం జరిగిన పల్లె ప్రగతి సంబురాలలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పట్టణాలకు దీటుగా పల్లెల్లో మౌలిక వసతులు కల్పించి పల్లెల రూపురేఖలు మార్చారని అన్నారు. పల్లెలలో సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, హరితహారం, పల్లె పకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి, హరితహారంతో పాటు అనేక పథకాలు చేపట్టి పల్లెలను సుందరంగా మార్చారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రతిపల్లెలో ప్రతిగడపకు అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో దేవసహాయం, డీపీవో రమణమూర్తి, ఆర్డీవో రవి, సర్పంచులు మోహన్‌రెడ్డి, గుర్కా కుమార్‌యాదవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పూడూరు, జూన్ 15 : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో మంత్రి సబితారెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి, సోలార్ లైటింగ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాగణాన్ని జడ్పీ చైర్పర్సన్ సునితరెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ఉహించని అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ 2014కు ముందు, తర్వాత పరిస్థితులను బేరిజు వేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 8వేల పంచాయతీలు ఉండగా, నూతనంగా 4వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించి ప్రజలకు పంచాయతీ వ్యవస్థను మరింత దగ్గరగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ కె.రవి, ఎంపీటీసీ సురేందర్, తదితరులు ఉన్నారు.