సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కూకట్పల్లి కమలం నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడిన పల్లపు గోవర్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నేత గోవర్ధన్‌ను బీఆర్ఎస్లోకి రావాలని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆహ్వానించారు. శుక్రవారం భారీ ర్యాలీతో తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు గోవర్ధన్ ప్రకటించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీతో 22 ఏండ్ల అనుబంధం ఉన్నదని పార్టీ మారినా.. హిందుత్వం, ధర్మం కోసం సంఘ్ స్ఫూర్తితో పనిచేస్తానని తెలిపారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బలహీన వర్గాలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. పార్టీకోసం సర్వం దారపోసిన తనను పార్టీ అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గోవర్ధన్ వెంట యువజన సంఘాలు, వడ్డెర, ఉప్పెర ఇతర బీసీ నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ కానున్నది.