సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, సెప్టెంబరు 30 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ప్రకటించారు. నియోజకవర్గంలో 3.99 లక్షల ఓటర్లుండగా, 1 జూలై 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు.
లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18-19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలు చెందిన వారు ఉన్నారు.
విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబరు 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉండగా, నిరంతరం సవరణ తర్వాత 6,976 మంది కొత్తగా చేర్చినట్లు అధికారులు చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు సరాసరిగా 980 ఓటర్లు ఉన్నారు. కాగా జూబ్లీహిల్స్ నియోజకర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.