బేగంపేట్, ఏప్రిల్ 10: పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్‌నగర్‌లోని దాసారం లో సుమారు 300 కుటుంబాలు గత 30 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొందరు వ్యక్తులు తమ ప్రాంతానికి వచ్చి గుడిసెలు ఖాళీ చేయాలని హెచ్చరించారని ఆందోళనకు గురైన వారు గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఎన్నో సంవత్సరాల నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు తమను వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ తదితర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. బాధితుల వెంట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, అధ్యక్షుడు హన్మంతరావు, సురేశ్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.