బేగంపేట్ , డిసెంబర్ 27: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన భాషను మార్చుకోవాలని, స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితువు పలికారు. శనివారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తానని రెండేళ్లు అవుతున్నా నేటికీ ఇవ్వలేదని.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతినెలా అందిస్తామన్న రూ.2500 ఏమాయ్యయని అడిగారు. వికలాంగులకు 3 నుంచి 6 వేల వరకు పెంచుతామన్న పింఛన్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తొండలు వదులతా, పేగులు వేసుకుంటా అంటూ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం విచారకరమన్నారు.
డీ లిమిటేషన్ పేరుతో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా డివిజన్లను ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా, కౌన్సిల్ సమావేశాల్లో అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. హడావుడిగా డివిజన్లను ఏర్పాటు చూయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు.
సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ మోండా డివిజన్ పరిధిలో ఉంటే మోండా డివిజన్‌ను తీసుకువెళ్లి మల్కాజ్‌గిరిలో కలపడం ఏంటని ప్రశ్నంచారు. ఈ కార్యక్రమంలో తహసీల్ద్ధార్ పాండునాయక్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ఆకుల హరికృష్ణ,నాగులు, శ్రీహరి,ఆంజనేయులు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.