Secunderabad | బేగంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ పాలన సాగిస్తున్నది మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మన అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి క్లాక్‌టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌లో ఆషాడ మాసంలో నిర్వహించే లష్కర్ బోనాల ఉత్సవాలకు ప్రపంచ గుర్తింపు ఉందని చెప్పారు. 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకోకుండా పేరు మారుస్తామంటే ఊరుకోబోమన్నారు.
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉన్నదని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి… సికింద్రాబాద్‌లోని కొన్ని పోలీస్ సర్కిళ్లు, జీహెచ్ఎంసీ సర్కిల్స్‌ను మల్కాజిగిరి పరిధిలోకి మార్చారా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ పుట్టి పెరిగిన వారు ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నవారు ఇంటికొక్కరు చొప్పున ఈ శాంతి ర్యాలీలో పాల్గొని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం, మహిళలకు రూ.2500 వంటి అనేక హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీకి కేటీఆర్ రాక
ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఉనికి లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిర్వహించే ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. సికింద్రబాద్ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన తరుణం వచ్చిందన్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై గాంధేయ మార్గంలో ఒత్తిడి తీసుకొచ్చేలా ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతి ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ర్యాలీలో కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు.
విజయవంతం చేద్దాం..
సికింద్రాబాద్, జనవరి 16: సికింద్రాబాద్ ప్రాంతం అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు నిర్వహించే నేటి శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్మండి, బౌద్ధనగర్ మున్సిపల్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నేతలు, ఉద్యమకారులు, వివిధ పోలింగ్ బూత్ కమిటీల ప్రతినిధులు శనివారం నిర్వహించే శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఉదయం 9.30 గంటలకు ప్రతి ఒకరూ సికింద్రాబాద్ చేరుకొని క్లాక్ టవర్, పాట్నీ, ప్యారడైస్, ఎంజీ రోడ్డు వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కోరారు.