Talasani Srinivas Yadav | సికింద్రాబాద్కు శతాబ్దాల చరిత్ర ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజిగిరిలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలను కోరారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు చేపడుతున్నాడని తలసాని విమర్శించారు. అసలు పనులు చేయకుండా తుగ్లక్ పాలన కొనసాగించడం సరైంది కాదని హితవు పలికారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సికింద్రాబాద్ అంటే ఇక్కడి ప్రజలకు ఒక ఎమోషన్ అని తెలిపారు. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన సందర్భం ఇదీ అని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ కార్పొరేషన్ జిల్లా కోసం చేపడుతున్న శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.