చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 2: పాతనగరంలో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల మేర విలువ చేసే భూములను కొంతమంది సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించి హల్చల్ చేస్తున్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల అండతో యథేచ్ఛగా కబ్జాలకు తెర తీస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ మండలం కందికల్ గ్రామ పరిధిలో లలితాబాగ్ రైల్వేబ్రిడ్జి సమీపంలో ప్రభుత్వ (జీఆబాదీ) భూమి ఉంది. ఈ భూమిని కబ్జా చేయడానికి ఈ నెల 1వ తేదీన బీపీ రెడ్డి, ఉర్సుదాస్తో పాటు ఇతర వ్యక్తులు రంగ ప్రవేశం చేశారు. జేసీబీలతో భూమిలో పెరిగిన చెట్లను తొలగించడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న బండ్లగూడ తహాసీల్దార్ నవీన్ భావానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బీపీ రెడ్డి, ఉర్సుదాస్ అనే వ్యక్తితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ భూమి టీఎస్ 28లో కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారు అని సమాచారం రావడంతో భావానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు కబ్జాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ప్రభుత్వ భూమిపై కన్నేసిన వారిపై చట్టాపరంగా చర్యలు తీసుకుంటాం. ఏవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ప్రజలు రెమెన్యూ అధికారులకు సమాచారం అందించాలి.
– ఇ.నవీన్(బండ్లగూడ మండల తహాసీల్దార్)