Waqf Lands | సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడిచిన నాలుగు నెలలుగా నగరంలో ప్రధానంగా మేడ్చల్ జిల్లా పరిధిలో పలు సర్వే నంబర్లను సర్కారు నిషేధించింది. దీంతో అవసరానికి ఇండ్లు, భూములను అమ్ముకోలేక జనాలు తిప్పలు పడుతున్నారు. రెండు దశాబ్దాల కిందట ఇచ్చిన గెజిట్ను ప్రామాణికంగా తీసుకొని, ఇప్పుడు వక్ఫ్ భూములని తేల్చి చెప్పడంతో నెత్తినోరు బాదుకుంటున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తుందని భావించిన స్థిరాస్తులను ప్రభుత్వం ‘వక్ఫ్ పాతర’ వేసిందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎందుకు ఉన్న పళంగా వక్ఫ్ భూముల పేరిట సర్కారు రిజిస్ట్రేషన్లు నిలిపివేసిందనేది ఇప్పుడు అంతు చిక్కని సమస్యగా మారుతుండగా, ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ నిబంధన ఎందుకు అమలు చేస్తుందనేది తెలియడం లేదు. దీని వెనుక రియల్ ఎస్టేట్ కుట్ర దాగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుండగా, స్థానికంగా తమ భూములను గిరాకీ లేకుండా పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఈస్ట్ సిటీలో సుమారు 100కుపైగా..
ఈస్ట్ సిటీలోని దాదాపు 100కు పైగా కాలనీలను వక్ఫ్ భూముల జాబితాలో చేర్చిన ప్రభుత్వం… స్థిరాస్తి వ్యవహారాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో నగర వాసులు తమ భూముల కోసం ఆరా తీస్తున్నారు. ఇన్నాళ్లు తమవేనని ధీమాగా ఉన్న ఆ గుండెల్లో వక్ఫ్ గుబులు పుట్టుకున్నది. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట కొనుగోలు చేసిన భూములను ఇప్పుడు వక్ఫ్ భూములుగా నిర్ధారించడం తమపై ప్రభుత్వం వేసిన పిడుగేనని అభిప్రాయపడుతున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఈస్ట్ సిటీలోని ప్రధానమైన మల్కాజిగిరి, ఉప్పల్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లోనూ పలు కాలనీల్లో ఉండే వందల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న ఇండ్లు, జాగాలన్నీ కూడా వక్ఫ్ బోర్డు వశం చేసేలా ప్రభుత్వ వ్యవహారం ఉంది. దశాబ్దాల కిందటే రిజిస్ట్రేషన్లు, చార్జీలు కట్టి, మ్యూటేషన్ చేసుకుని, బల్దియా అనుమతులతో కట్టిన ఇండ్లకు నల్లా, కరెంట్, ఘరీపట్టి కడుతున్న ఇండ్లు, ఖాళీ జాగాల జీవం తీసేలా చేసింది.
పేదల బతుకులతో చెలగాటం..
రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములన్నీ నిర్ధారించిన సర్వే నంబర్లను కూడా ఎలాంటి ప్రామాణికత లేకుండా వక్ఫ్ భూములుగా నిర్ధారిస్తూ సర్కారు నిషేధించింది. ఆయా సర్వే నంబర్లలో ఉండే అన్ని భూములకు వక్ఫ్ నిబంధనలు వర్తిస్తూ తీసుకువచ్చిన సర్క్యూలర్ ఇప్పుడు పేదోడి గుండెను నలిపేస్తున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు కాలనీలను వక్ఫ్ జాబితాలో చేర్చి… వారితో బతుకులతో సర్కారు చెలగాటమాడుతున్నది. ఒక్క మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని మౌలాలీలోని వందకు పైగా సర్వే నంబర్లను వక్ఫ్ జాబితాలో చేర్చింది. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో మూడు నెలలుగా అక్కరకు వస్తుందనుకునే స్థిరాస్తి కాస్తా చిక్కుల్లో పడిందని ప్రజలు మదన పడుతున్నారు. అవసరానికి సొమ్ము చేసుకోలేక, అప్పులు తీసుకోలేక, తమవే అనుకున్న భూములు తమకు కాకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అయితే వక్ఫ్ భూములుగా నిర్ధారిస్తూ పేదల బతుకులతో చెలగాటం ఆడుతున్నట్లుగా ప్రభుత్వం వ్యవహారిస్తుందని మండిపడుతున్నారు.
20వేలకు పైగా కుటుంబాలు..
1989లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఒక్క మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోనే 20వేలకు పైగా కుటుంబాలను రోడ్డునపడేసింది. ఇలా ఒక్క మేడ్చల్ జిల్లాలోనే ఉందనుకుంటే పొరపాటే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ అంతర్గతంగా వక్ఫ్ భూముల సర్క్యూలర్స్ విడుదల అయినట్లుగా తెలిసింది. ఇదే గనుక జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వక్ఫ్ భూముల పేరిట బాధితులుగా మారే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే దశాబ్దాల కిందటే ఆ భూములను వక్ఫ్ భూములుగా పేర్కొంటే… ఆ సర్వే నంబర్లలో ఇన్నాళ్లు ఎందుకు లావాదేవీలను నిలిపివేయలేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చిన పదేండ్ల తర్వాత వక్ఫ్ గుబులు పెట్టించడం వెనుక ఏదో పెద్ద కుట్రనే దాగుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
నిషేధిత కాలనీలివే..
ఒక్క మల్కాజిగిరి నియోజకవర్గంలోనే కాలనీ నిషేధించిన సర్వే నంబర్లు వందకు పైగా ఉన్నాయి. వీటితోపాటు బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లి, అన్నోజిగూడ, ఈసీఐఎల్ సమీపంలోని రాంపెల్లి, ఘట్కేసర్లోని పలు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక మౌలాలి గుట్టకు సమీపంలో ఉన్న.. సఫిల్ నగర్, హరిజన్ బస్తీ, సాదుల్లా నగర్, ద్వారకమాయి కాలనీ, సుధా నగర్, భజన మందిర్, న్యూ వెంకటేశ్వర్ నగర్, భరత్ నగర్, విఘ్నేశ్వర్ నగర్, గణేశ్ నగర్, మహాత్మ గాంధీ నగర్, నెహ్రూ నగర్, శ్రామిక నగర్, ఈస్ట్ ప్రగతి నగర్, ఎస్పీ నగర్, ఆండాల్ నగర్, చందా బాగ్, వడ్డెర బస్తీ, ఓల్డ్ మౌలాలీ, బాగ్ ఏ హైదరీ, హనుమాన్ నగర్, ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్, పీఎన్ఆర్ కాలనీ, కేసీఆర్ బస్తీ, ఓల్డ్ సఫిల్ గూడ, రాక్ హిల్ కాలనీ, శంకరయ్య కాలనీ, పీబీ కాలనీ, జేకే కాలనీ, సమతా నగర్, ఈస్ట్ కాకతీయనగర్ ఇలా వందలాది కాలనీలు కూడా నివాసాలుగా దశాబ్దాల కిందటే మారిపోయాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న వచ్చిన సర్క్యూలర్ ఇప్పుడు ఆ కాలనీల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని భయాందోళనలకు గురి చేస్తున్నది.
రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సరికాదు..
పేదలు, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎంతో మంది ఎన్నో ఏళ్ల కిందట కట్టుకున్న ఇండ్లను ఇప్పుడు వక్ఫ్ భూములుగా నిర్ధారించడం వెనుక పెద్ద కుట్ర జరుగుతున్నది. నిజానికి ఒక భూమిని వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి. నిజంగా వక్ఫ్ భూములని 1989లోనే తేల్చితే, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు. మరీ ఇన్నాళ్లు కట్టిన పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, కొనుగోలు చేసేందుకు అయిన డబ్బుల సంగతేంటీ? వక్ఫ్ భూములకు ప్రత్యేక చట్టాలు ఉండొచ్చు. కానీ నివాసం ఉంటున్న ఇండ్లను ఈ జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సరికాదు. ప్రభుత్వానికి పేదలను అభివృద్ధి చేయాలనే తపన ఉంటే… ఇలాంటి సమస్యాత్మక భూముల వివాదాలకు తెర దించేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వక్ఫ్ భూముల జాబితా నుంచి వీటిని తొలగించాలి. అంతే గానీ రిజిస్ట్రేషన్లు ఆపితే, అవసరానికి అమ్ముకోవాలని అనుకునేవారి పరిస్థితి ఏం కావాలి.
-నారగోని ప్రవీణ్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
వక్ఫ్ భూముల ఉత్తర్వులను రద్దు చేయాలి
ప్రభుత్వం వక్ఫ్ బోర్డు రిజిస్టేషన్లు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఉన్న పదుల కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఇంటి పన్ను, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు చెల్లిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఇంటిపైన లోన్ తీసుకోవడానికి బ్యాంకులు ఇవ్వడం లేదు. అదేమంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని అంటున్నారు. దీంతో ఇన్నాళ్లు మా ఆధీనంలో ఉన్న భూముల భవిత ఏమవుతుందనే అనుమానంతో ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం లాగేసుకుంటే మా కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది.
– రఫీక్,జీకే కాలనీ
ఇబ్బందులు వస్తున్నాయి..
మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వక్ఫ్ బోర్డు స్థలాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని మాకు పైసాపైస కూడబెట్టి ఏండ్ల కిందటే భూములు కొని, ఇండ్లు కట్టుకున్నాం. ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ, పలు సర్వే నంబర్లను నిషేధించడం వల్ల నష్టం వాటిల్లుతుంది. బ్యాంక్ నుంచి లోన్లు రావని తెలిసి ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వక్ఫ్ బోర్డు పేరిట జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను ఎత్తివేయాలి.
– జీ రాము, జీకే కాలనీ