బంజారాహిల్స్, జూలై 11: బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం, ఎమ్మెల్యే కాలనీకి మధ్యన ఉన్న సుమారు రూ.1000కోట్ల విలువైన 8.24 ఎకరాల స్థలం వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలతో శనివారం అడ్వకేట్ కమిషన్ సమక్షంలో హైదరాబాద్ జిల్లా సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. జిల్లా సర్వే అధికారి వెంకట్‌రెడ్డి, బుచ్చయ్యతో పాటు షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు ఆరుగంటల పాటు నిర్వహించిన సర్వేలో భాగంగా హెచ్ఎండీఏకు అప్పగించిన స్థలానికి సంబంధించిన 8.24 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. దీంతో పాటు స్థలంపై హక్కులు ఉందంటూ వాదిస్తున్న యమునా నగర్ సొసైటీ ప్రతినిధులు, జతిన్‌రాజ్ జైన్‌కు చెందిన వ్యక్తులు, బంజారాకుంజ్ సొసైటీ తదితర ప్రతినిధులు, తమ స్థలాలున్నాయని పెద్ద సంఖ్యలో వ్యక్తులు అక్కడకు రావడంతో హడావుడి నెలకొంది. షేక్‌పేట మండలంలోకి వచ్చే హకీంపేట విలేజ్ పరిధిలోని సర్వే నెంబర్ 102/1, టీఎస్ 1/పీ, 3/పీ, బ్లాక్-జే, వార్డు 12లో 8.34 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది.
ఈ స్థలం చుట్టూ ఏడాది క్రితం ఫెన్సింగ్ వేసిన రెవెన్యూశాఖ అధికారులు దీన్ని హెచ్ఎండీఏకు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాలకోసం స్థలాన్ని ఉపయోగిస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు జిల్లా అధికారులుపదీన్ని హెచ్ఎండీఏకు అప్పగించడంతో పాటు గత నెల 19న వేలంపాట వేసి అమ్మేందుకు ప్రయత్నించగా వివాదం రాజుకుంది. ఈ స్థలంపై అనేక వివాదాలు కోర్టులో ఉన్నాయంటూ జతిన్‌రాజ్ జైన్ అనే వ్యక్తితో పాటు యమునానగర్ కో అపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారు హైకోర్టును ఆశ్రయించగా హెచ్ఎండీఏ చేపట్టిన వేలంపాట ఆపాలని, అడ్వకేట్ కమిషన్ ఆధ్వర్యంలో మరోసారి పిటిషనర్ల సమక్షంలో సర్వే నిర్వహించి జూలై 20లోగా తమకు నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో శనివారం సర్వే ప్రారంభించారు.
కాగా ఈ స్థలంతో పాటు పక్కనున్న సుమారు 16ఎకరాల స్థలంపై తమకు హక్కులున్నాయంటూ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారే ఈ స్థలం తమదంటూ వాదించడం.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాదనలు వినిపిస్తుండడంతో అడ్వకేట్ కమిషన్ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, శ్యామ్ ఎస్ అగర్వాల్ గందరగోళానికి గురయ్యారు. సంబంధిత వ్యక్తులను పత్రాలు, సర్వే నివేదికలు చూపించాలని కోరగా అవన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయని, కోర్టు తీర్పుల తర్వాతనే స్థలాన్ని వేరొకరికి విక్రయించాలని, ప్రభుత్వం ఒత్తిడితో హడావుడిగా వేలంపాట వేస్తున్నారని వారు ఆరోపించారు. సంబంధిత వ్యక్తులు తమ అభ్యంతరాలను, తమవద్దనున్న ఆధారాలను సమర్పించేందుకు వారంరోజుల సమయం ఇవ్వాలని కోరగా వారం తర్వాత సర్వే పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.