HYDRAA | బడంగ్‌పేట, సెప్టెంబర్ 9: హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు.. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెరువుల పరిధిలో వెలిసిన ఆక్రమణలపై సర్వే మొదలుపెట్టారు. చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువుల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. జిల్లెలగూడలోని చందన చెరువు, మీర్‌పేటలో ఉన్న మంత్రాల చెరువు, పెద్ద చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిని ఇరిగేషన్ ఏఈ జనార్దన్ నిర్ధారించారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే నిర్మాణాలను గుర్తించే పనిలో నిమగ్నమైన అధికారులు.. ఎంఎల్ఆర్ కాలనీ, శివాజీ నగర్, వివేక్ నగర్‌తో పాటు మరికొన్ని కాలనీలు బఫర్‌జోన్ పరిధిలోకి వస్తున్నట్లు గుర్తించారు. చందన చెరువు పరిధిలో పలు వ్యాపార సముదాయాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నట్లు తేల్చారు.
ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన ఎన్ని ఇండ్లకు మున్సిపల్ నుంచి అనుమతులు వచ్చాయో పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఎన్ని ఇండ్లను నిర్మించారు.. వాటి జాబితా, అనుమతి లేకుండా వెలిసిన వ్యాపార సముదాయాల జబితాను వేర్వేరుగా ఇవ్వాలని హైడ్రా సూచించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇండ్లలో ఉంటున్న వారు ఇంటి పన్ను ఎంత చెల్లిస్తున్నారో.. వాటి వివరాలు కూడా పొందుపర్చాలని సూచించినట్లు చెప్పారు.
చర్యలు తీసుకోవడం ఖాయం
చందన చెరువు పరిధిలో కొన్ని వ్యాపార సముదాయాలు కూడా ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంత్రాల చెరువు పరిధిలో ఉన్న ఎంఎల్ఆర్ కాలనీ పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు అధికారులు 260 ఇండ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా మీర్‌పేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తించాల్సి ఉన్నదని అధికారులు వెల్లడించారు. లెనిన్ నగర్ తాళ్ల చెరువు పరిధిలో నిర్మించిన వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవడం ఖాయమంటున్నారు. పేదల ఇండ్లను వదిలేసి వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల జాబితాను రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
హైడ్రా సర్వేతో గుబులు
ఇటీవల అధికారులు చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో సర్వే మొదలుపెట్టడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలకు వచ్చి ఆరా తీస్తున్నారు. ఎన్ని కాలనీలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వస్తున్నాయో.. ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.