దేశంలో ఉత్తమ వైద్య సేవలందించే వైద్య సంస్థగా పేరొందిన నిమ్స్ ఆస్పత్రిలో నాసిరకం వైద్య పరికరాల వినియోగం కలకలం రేపుతోంది. రోగుల ప్రాణాలకు అత్యంత కీలకమైన శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల్లో పూర్తిగా నాణ్యత లోపించడంతో ఆస్పత్రి వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆపరేషన్ సమయంలో గ్లౌజులు చిరిగిపోవడం, స్పైనల్ అనస్థీషియాకు వినియోగించే క్యాథటర్ విరిగిపోతుండటంతో అటు రోగులు, ఇటు వైద్యులు గగ్గోలు పెడుతున్నారు.
– ఖైరతాబాద్, జూన్ 3
నిమ్స్ దవాఖానకు అవసరమయ్యే వైద్య పరికరాలన్నీ రేట్ కాంట్రాక్ట్ విధానంతో సమకూరుతుంటాయి. కావాల్సిన వస్తువులకు ఒక రేట్ పెట్టి టెండర్లను ఆహ్వానిస్తారు. పరికరాల కొనుగోలుకు ముందు వైద్యుల బృందంతో ఒక కమిటీ వేస్తారు. సదరు కమిటీ ఎలాంటి పరికరాలు తీసుకోవాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి, నాణ్యత ప్రమాణాలను ఎలా గుర్తించాలి….తదితర అంశాలపై విచారణ చేస్తుంది. పరికరాలను సరఫరా చేసే సంస్థల ఎంపికలోనూ ఫైనాన్షియల్, టెక్నికల్ అనే రెండు విభాగాలను పరిగణంలోకి తీసుకుంటారు.
ఆయా ప్రక్రియల్లో ఆ పరికరం నాణ్యత, మన్నిక, ట్రాక్ రికార్డ్, టర్నోవర్ తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. రేట్ ఎక్కువగా ఉన్నా….నాణ్యమైన పరికరాల కొనుగోలుకే ప్రాధాన్యతనివ్వాలి. అలా అన్ని పరీక్షలను నెగ్గిన సంస్థకు అవకాశం కల్పిస్తారు. కానీ నిమ్స్ దవాఖానలో ప్రస్తుత రేట్ కాంట్రాక్ట్ ద్వారా కొనుగోలు చేసిన పరికరాల్లో నాణ్యత పూర్తిగా కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిరకం పరికరాలను సరఫరా చేసే సంస్థలకే అవకాశం ఇస్తున్నారని టాక్. పెద్దల హస్తంతో సర్జికల్ స్టోర్స్ కేంద్రంగా అవినీతి జరుగుతుందని పలువురు వైద్యులు ఆరోపిస్తున్నారు.
ఫలితంగా నాసిరకం గ్లౌజులు, క్యాథటర్లు, ఇతర నాణ్యత లేని పరికరాలు నిమ్స్‌లో వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. కొందరి అవినీతి దాహం వల్ల నాసిరకం పరికరాలు సరఫరా చేసే సంస్థలకే అవకాశం కల్పించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రేట్ కాంట్రాక్ట్ సైతం 2-3 నెలలు మాత్రమే ఉండాలి….కానీ నిమ్స్ దవాఖానలో మాత్రం ఏడాది దాటినా ఆ కాంట్రాక్ట్ ముగియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ వైద్యుడు సాహసం చేసి సంబంధిత విభాగానికి ఫిర్యాదులో పేర్కొనడంతో ఈ నాసిరకం వ్యవహారం వెలుగుచూసింది.
నరకం చూస్తున్న రోగులు….
గైనకాలజీ, యూరాలజీ, అర్థోపెడిక్, వాస్క్యూలర్ తదితర విభాగాల్లో ఎపిడ్యూరల్ అనస్థీషియా ప్రక్రియను వినియోగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా రోగి నడుము కింద భాగంలో వెన్నుపూస వద్ద క్యాథటర్, నీడిల్ సాయంతో మత్తు మందును ఇస్తారు. అయితే నిమ్స్ దవాఖానలో కొత్త రేట్ కాంట్రాక్ట్ ద్వారా ఎల్-1 కేటగిరిలో కొనుగోలు చేసిన (ఎస్జిఎస్250119) కోడ్‌కు చెందిన ఎపిడ్యూరల్ మినీ ప్యాక్‌లు పూర్తిగా నాసిరకంగా ఉన్నట్లు పలువురు వైద్యులు యాజమాన్యం, సర్జకల్ స్టోర్స్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ పరికరాలు సమర్థవంతంగా పనిచేయకపోవడంతో ఒకే రోగికి ఎపిడ్యూరల్ ప్రక్రియ నిర్వహించే సమయంలో క్యాథటర్లు విరిగిపోతుండటం వల్ల రెండు నుంచి మూడు ప్యాక్‌లు ఉపయోగించి పలుమార్లు సూదులు గుచ్చాల్సి వస్తోందని, దీంతో రోగి శస్త్రచికిత్స అనంతరం మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత నొప్పితో నరకాన్ని అనుభవిస్తున్నారని, నాణ్యమైన పరికరాలు తెప్పించండంటూ ఆ వైద్యులు ఫిర్యాదులో వాపోయినట్లు తెలిసింది.
ప్రశ్నించిన వైద్యులపై బెదిరింపులు..!
ఇదిలా ఉండగా, నాసిరకం వస్తువులు వాడలేక ఇబ్బందులు పడుతున్న వైద్యులు పలుమార్లు యాజమాన్యాన్ని నిలదీసినట్లు తెలిసింది. అయితే నిలదీస్తే తమకు పెద్దల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పలువురు వైద్యులు మీడియాకు వివరించారు. అయితే ఈ ఫోన్‌కాల్ అధిక శాతం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్నట్లు పలువురు బాహాటంగానే చెబుతున్నా రు. దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హ స్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చర్చలు లేకుండానే కొనుగోళ్లు
నిమ్స్ దవాఖానకు ఎలాంటి పరికరాలుకొనాలి…ఎవరికి అవకాశం ఇవ్వాలి. నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలు రేట్ కాంట్రాక్ట్ ప్రక్రియ కోసం కూర్చునే వైద్యుల కమిటీ నాతో చర్చించాలి. గత 2 సంవత్సరాలుగా ఆ ప్రక్రియ కొనసాగడం లేదు. దాన్నంతటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత నాదే అయినా రేట్ కాంట్రాక్ట్, టెండర్లు, పరికరాల ఎంపిక అంతా నాకు తెలియకుండానే కానిచ్చేస్తున్నారు.
– డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్