దుండిగల్, జూలై 2: మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఓ కారు సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కట్ట మైసమ్మ (లింగం చెరువు) కట్టప్ప ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్‌ను ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం… బుధవారం ఉదయం కారు సూరారంలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద అదుపుతప్పి లింగం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్స్ ని ఢీకొంది. రైలింగ్ పడిపోవడంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది.
డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు అందులోనే ఉన్న మరో వ్యక్తి పరారయ్యారు. కొద్దిసేపటి అనంతరం స్థానికంగా ఉండే కొందరు నేతలు జేసీబీని తీసుకువచ్చి దాని సహాయంతో కారును బయటకు లాగి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించారా…? ఇంకేమైనా అనుమానాస్పదంగా వ్యవహరించారా …?తెలియాల్సి ఉంది.
ఈ విషయమై సూరారం సీఐ భరత్ కుమార్ వివరణ కోరగా, లింగం చెరువులోని బతుకమ్మ ఘాట్ వద్ద కారు అదుపుతప్పి చెరువుకు రక్షణగా ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్స్‌ని ఢీకొట్టడంతో అది విరిగిపోయిన మాట వాస్తవమేనన్నారు. కారు సైతం చెరువులోకి దూసుకెళ్లగా, సంబంధీకులు బయటికి తీసుకుని వెళ్లిపోయినట్టు సమాచారం ఉందన్నారు. అయితే ప్రమాదం విషయమై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదన్నారు.