సిటీబ్యూరో: బాగ్అంబర్పేటలోని సర్వేనెంబర్ 563/1 భూమిని బతుకమ్మకుంటగా మార్చారనే ఆరోపణలకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బతుకమ్మకుంట వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన గేట్, ఫెన్సింగ్, రిటైనింగ్‌వాల్‌ను తొలగించాలని హైకోర్టు చెప్పినా వాటిని కొనసాగించడం సముచితమంటూ దాఖలు చేసిన నివేదికపై హైకోర్టే విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బతుకమ్మకుంటలో యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా హైడ్రా పలు నిర్మాణాలు చేపట్టిందంటూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు నాలుగువారాల్లో తొలగించాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ధర్మాసనం మరోమారు విచారణ చేపట్టింది. స్థానిక పరిస్థితుల గురించి తమ కంటే హైకోర్టుకే ఎక్కువగా తెలుస్తుందని, అందుకోసం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తున్నామంటూ జస్టిస్ దీపాంకర్ దత్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.