సిటీబ్యూరో, డిసెంబరు 15 (నమస్తే తెలంగాణ): గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మొయినాబాద్‌లోని ముడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నదని సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు శ్రీరామనగర్, సూరంగల్, వెంకటాపూర్ తదితర గ్రామ శివారు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు.
ఈ క్రమంలో సూరంగల్ శివారు ప్రాంతంలో ఉన్న ఏఎంఆర్ వెంచర్లో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి ఆవరణలో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసు బృందం ఆ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. పోలీసులను చూసిన వారిద్దరు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్‌కు చెందిన బావర్ఖాన్(37) డ్రైవర్. ఉపాధి కోసం నగరానికి వలసొచ్చిన అతడు మేడ్చల్‌లో నివాసముంటున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఒడిశాలోని మనోజ్ అనే గంజాయి వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. గురువారం తన కారుతో ఒడిశా వెళ్లిన బావర్ఖాన్.. అక్కడ మనోజ్ వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. ఈ గంజాయిని ధూల్‌పేటకు చెందిన సునీల్సింగ్కు కిలో రూ.వెయ్యి చొప్పున విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం నగర శివారు ప్రాంతానికి చేరుకుని సునీల్సింగ్కు సమాచారమిచ్చాడు.
ఏఎంఆర్ వెంచర్‌లోని నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వెళ్లాలని, అక్కడ తన సోదరుడు నితేశ్సింగ్ లేదా బావమరిది వినేష్సింగ్ ఉంటాడని, వారికి గంజాయిని అప్పగించాలని సూచించాడు. ఈ మేరకు బావర్ఖాన్ ఏఎంఆర్ వెంచర్లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వెళ్లి అక్కడున్న నితేసింగ్కు గంజాయిని అందజేశాడు. అంతలోనే మొయినాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయితో పాటు కారు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన వారిలో మొయినాబాద్ ఎస్ఐ కిషన్‌సింగ్, హెడ్‌కానిస్టేబుల్ దేవిసింగ్, కానిస్టేబుల్ రాజు, హోమ్‌గార్డు సత్తయ్య తదితరులు ఉన్నారు.