సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. వాహనదారులు నర కం చూశారు. ముఖ్యంగా హెచ్సీయూ, మియాపూర్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలీ, చందానగర్, హఫీజ్పేట్, ఫతేనగర్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్, కేపీహెచ్బీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది.
అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్ హెచ్సీయూలో 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 11.23 సెం.మీ వర్షం పాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిటీ బస్టాప్లల్లో తడుస్తూ తీవ్ర నరకం చూశారు. ట్రాఫిక్ కారణంగా బస్సులు ఆలస్యంగా నడిచాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీళ్లు నిల్వడంతో వాహనాలు నెమ్మదిగా సాగడంతో 10 నిమిషాల ప్రయాణం గంటకు పైగా పట్టిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.