సిటీబ్యూరో: రెండ్రోజులుగా విడిచిపెట్టకుండా పడుతున్న వర్షానికి గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ హాస్పిటల్లో సెల్లార్లోకి వరద నీరు చేరింది. గురువారం తెల్లారే సరికి సిబ్బంది విధులకు వచ్చే లోపు భారీగా చేరిన వరద నీటిని చూసి నిర్ఘాంతపోయారు. దీంతో లిఫ్టులు పాడైపోగా, సెప్టిక్ ట్యాంకుల నుంచి మురుగు సెల్లార్లోకి చేరింది. రోగుల రాకపోకలు వీల్లేకుండా పోవడంతో వైద్య సేవలతోపాటు, భోజన సరఫరా వరకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక బంజారాహిల్స్, పంజాగుట్ట మధ్య విస్తరించి ఉన్న నిమ్స్ దవాఖానల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎగువ నుంచే ఎమర్జెన్సీ బ్లాక్ నుంచి పంజాగుట్ట వరకు వరద నీరు పోటెత్తింది. దీంతో మిలియన్ బ్లాక్, క్యాంటీన్ పరిసరాలు బుధవారం అర్ధరాత్రి వరద నీటితో నిండిపోయాయి. ఇక నిమ్స్ మెయిన్ గేట్ ఎదుట భారీగా వరద నీరు చేరడంలో దవాఖానలోకి వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి వరకు పంజాగుట్ట నుంచి నిమ్స్ దవాఖాన మార్గంలో అంబులెన్స్, రోగులకు ఇబ్బందులు తప్పలేదు. కనీసం హైడ్రా సిబ్బంది నిలిచిన నీటిని తొలగించకపోవడంతో రాత్రంతా వరద నీటిలో వాహన రాకపోకలు సాగినట్లుగా స్థానికులు తెలిపారు.