Quthbullapur | కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తవ్వే కొద్దీ దొంగ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్‌కు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఇంటి స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి స్వాహా చేసిన ఘటన మరువక ముందే.. బౌరంపేట్‌లో అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా చనిపోయిన మహిళ పేరిట ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి.. ఆమెకు చెందిన రూ. 20 కోట్ల విలువైన 1950 గజాల స్థలాన్ని కాజేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసినా.. కేసును వెలుగులోకి రాకుండా ప్రయత్నించడం..అధికారులు సైతం డాక్యుమెంట్లు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేయడం.. పలు అనుమానాలకు తావిస్తున్నది. -దుండిగల్, ఆగస్టు 3
బౌరంపేట్ రెవెన్యూ పరిధిలో 1984లో సతీశ్ సొసైటీ పేరిట వేములపల్లి సీతారామయ్య అనే వ్యక్తి వెంచర్ చేశారు. ఇందులో 1988లో సర్వసాయికుమారి అనే మహిళ 1950 గజాల (మొత్తం 6 ప్లాట్లు) స్థలాన్ని కొనుగోలు చేశారు. తన పేరిట 25/2/1988న రిజిస్ట్రేషన్(డాక్యుమెంట్ నంబర్ 1148/1988) చేసుకున్నారు. అనంతరం ఆమె తన భర్త మల్లికార్జున్శాస్త్రితో కలిసి బ్రెజిల్ వెళ్లారు. 2001లో అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ చనిపోయారు. వారి కుమారుడు కిరణ్‌బాబు నగరంలోని నానక్‌రాంగూడలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు సతీశ్ సొసైటీలో ఉన్న తన ప్లాట్లను చూసివెళ్లేవారు.
గతేడాది జూలై 10న తన స్థలం వద్దకు కిరణ్‌బాబు వెళ్లగా, అక్కడ రెండు రేకుల షెడ్లు కనిపించాయి. ఆందోళనకు గురైన అతను సూరారంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి..వాకబు చేయగా, లంగర్‌హౌజ్‌లో నివాసముంటున్న చిట్టినీడి శేఖర్‌బాబు(37) పేరిట 11/07/2019న సర్వసాయికుమారి రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. దీంతో కిరణ్‌బాబు ఆగస్టు 12, 2023న దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగి పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల కాలంలో సతీశ్ సొసైటీలోని ప్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ స్థలాలు కొన్న కూకట్పల్లి, బాలాజీనగర్‌లో నివాసముండే కొన్నెగంటి శ్రీనివాసరావు(55)కు ఖాళీగా ఉన్న సాయికుమారికి చెందిన 6 ప్లాట్లపై కన్నుపడింది. ఎలాగైనా సదరు స్థలాన్ని స్వాహా చేయాలని భావించి.. తనకు పరిచయమున్న శేఖర్‌బాబుతో కలిసి 2019లోనే కుత్బుల్లాపూర్ ఎస్ఆర్వో కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీలు తెప్పించుకున్నారు. సదరు స్థిరాస్తిని తమ పేరుపై మార్చుకోవాలనే ఉద్దేశంతో చంచల్‌గూడకు చెందిన ఇక్బాల్ అలీఖాన్‌ను కలిశారు. అతడి సలహా మేరకు ఆ స్థలాన్ని ఇమంది నారాయణరావు(40) అనే వ్యక్తి పేరిట స్పెషల్ పవర్ ఆఫ్ అటార్ని (ఎస్పీఏ)గా ఇచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్లు స్పష్టించారు.
సాయికుమారిగా మరో మహిళను చూపించి.. నకిలీ పాస్‌పోర్ట్‌ను సైతం సృష్టించారు. జూలై 19, 2019న ఎస్పీఏ(డాక్యుమెంట్ నంబర్ 5383/6/ వీఏ1/2019) పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దానిని శేఖర్‌బాబుకు విక్రయించినట్లు మరో రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత శేఖర్‌బాబు 1950 గజాలను పలువురికి విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు తేలింది. నకిలీ డాక్యుమెంట్లు చేయించి ఇచ్చిన ఇక్బాల్ అలీఖాన్‌కు రూ. 20 లక్షలు ఇచ్చిన నిందితులు.. ప్లాట్లు విక్రయించగా.. వచ్చిన సొమ్మును శేఖర్‌బాబు, శ్రీనివాసరావు, ఇమంది నారాయణరావు పంచుకున్నారు. 2001లో చనిపోయిన సర్వసాయికుమారి 2019లో తన ప్లాట్లను ఎలా విక్రయించారు.. అనే పాయింట్లో పోలీసులు విచారణ చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ 4న శేఖర్‌బాబు, శ్రీనివాసరావులను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా, అయితే ఇన్ని రోజులు నిందితుల వివరాలను బయటకు పొక్కనీయకపోవడానికి గల కారణాలు ఏమిటీ…? చిన్న ఘటన జరిగితేనే మీడియా సమావేశాలు పెట్టే పోలీసులు.. ఈ కేసులో మాత్రం వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు సైతం నకిలీ డాక్యుమెంట్లను గుర్తించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేక సందేహాలకు తావిస్తున్నది.