Property Tax | సిటీబ్యూరో, నవంబర్15 (నమస్తే తెలంగాణ) : పేద, మధ్య తరగతి ప్రజలకు కల్పించిన ఆస్తి పన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు నీళ్లొదిలింది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న నిర్మాణాలకు 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యాజమానులంతా ఏడాదికి రూ. 101 పన్ను చెల్లిస్తే సరిపోతుందని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేశారు. ఈ మేరకు రూ.100కోట్ల మేర చెల్లింపుదారులకు లబ్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అనధికారికంగా రద్దు చేసింది. పన్ను సవరణ పేరుతో లబ్ధిదారుల మెడపై కత్తి పెట్టి.. మీకు రూ.101 ఆస్తిపన్ను పథకం వర్తించదని, ఇకపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాలంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నది.
దీనిపై కార్పొరేటర్లు, ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 220 ప్రకారం ట్యాక్స్ సవరణపై ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం రూ.101లు చెల్లించే పన్ను చెల్లింపుదారులకు పన్ను రాయితీ లేదంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఇదే సమయంలో వాణిజ్య కేటగిరిలో విద్యుత్ కనెక్షన్లు ఉన్న నిర్మాణాలు, సున్నా విస్తీర్ణం కింద పన్ను చెల్లించిన భవనాలు, ఆస్తిపన్ను సున్నా రూపాయలుగా ఉండే నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నారు. పెరిగిన పన్ను విలువతో డిమాండ్ నోటీసులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అధికారుల తీరును రాబోయే జనరల్ బాడి సమావేశంలో ఎండగడతామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అధికార యంత్రాంగం అడ్డదారులు తొక్కుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. బల్దియాకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నును ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే సవరణలు చేస్తోంది. ఇందుకు విద్యుత్‌శాఖ బిల్లులు, సబ్ రిజిస్ట్రార్లను పావుగా వాడుకుంటున్నది. నూతనంగా కొనుగోలు చేస్తున్న ఖాళీ స్థలం నుంచి ఇండ్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ వరకు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఆస్తిపన్ను సైతం అసెస్మెంట్ చేస్తున్నారు. రిజిస్ట్రార్ అంతేకాదు స్టాండింగ్ కమిటీ నుంచి ఎటువంటి తీర్మానం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆస్తిపన్నును పెంచేశారు. ఒక మాటలో చెప్పాలంటే బల్దియా అప్రకటిత ఆస్తిపెంపు నిర్ణయాన్ని అమలు చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. అప్పుల ఊబిలో చికుకున్న జీహెచ్ఎంసీ బయటపడటానికి ఇదెక్కడి భారమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్స్డ్ 34వేల వరకు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2100కోట్ల లక్ష్యంతో ఇప్పటి వరకు రూ. 1300 కోట్ల వరకు రాబట్టారు. టార్గెట్ చేరుకోవడానికి ప్రస్తుతం రూ.101 ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలకు రేట్లను సవరించి పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించి, పెంచిన పన్నునే వసూలు చేస్తున్నారు. నాలుగు కేటగిరీల్లోని రెండు లక్షల నిర్మాణాలను సర్వే చేసి..మొత్తంగా రూ.50కోట్ల మేర ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. కాగా ఒక వేళ ఆస్తిపన్ను పెంచాలంటే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనని ఓ అధికారి తెలిపారు. కానీ ఈ రెండు కార్యక్రమాలు చేయకుండానే ఆస్తిపన్ను ఎలా పెంచుతారని పలువురు కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అప్రకటిత ఆస్తిపన్ను నిర్ణయాన్ని.. వచ్చే కౌన్సిల్లో నిలదీస్తామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.