బడంగ్ పేట్, జులై 2: బడంగ్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే విద్యార్థులను వర్షంలో నేలపై కూర్చోబెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. పలువురు స్థానికులు ఉపాధ్యాయులను వర్షంలో ఎందుకు కూర్చోబెట్టారంటూ ఉపాధ్యాయులను నిలదీసినట్లు సమాచారం. విద్యార్థులు చలికి ఇబ్బందయితే ఎవరు బాధ్యత వహించాలన్న ఆరోపణలపై వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదని.. మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందంటూ స్థానికులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్పా.. సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ పాఠశాల సమస్యలు పట్టించుకోలేదు ఆరోపించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను పాఠశాలకు వెళ్లే సరికి విద్యార్థులు వర్షంలోనే కూర్చున్నారన్నారు. అయినా, ఉపాధ్యాయులు పట్టించుకోలేదని ఆరోపించారు. వర్షంలో విద్యార్థులను కూర్చోబెట్టడం ఏమాత్రం మంచిది పద్ధతి కాదని.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటే ఇంత అలుసు ఎందుకని ప్రశ్నించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. విద్యార్థులను పరీక్ష రాయించడానికి బయట కూర్చొబెట్టామని.. ఆ సమయంల వర్షం రాలేదన్నారు. వాన వచ్చిన సమయంలో విద్యార్థులందరూ పాఠశాలలోకి వచ్చారన్నారు. చిన్న సమస్యను రాద్ధాంతం చేయడం బాధాకరమన్నారు.