Caste Census | మేడ్చల్: కులగణన సర్వేలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్న క్రమంలో కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పై చదువులతో పాటు పోటీ పరీక్షల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సకాలంలో విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందడం లేదన్న విమర్శలొస్తున్నాయి.
వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవలో చేసుకున్న దరఖాస్తుపత్రాలకు సంబంధించిన రసీదులతో మేడ్చల్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేకుండా పోతున్నది. కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ధ్రువీకరణ పత్రాలు అందక తిరిగి వెళ్లిపోవాల్సి వస్తున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పోటీ పరీక్షలకు అవసరం ఉన్న కుల, ఆదాయ ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కులగణన సర్వే పేరిట ధ్రువీకరణ పత్రాలు అందజేయడంలో కాలయాపన చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.