మూసీ పునర్జీవం పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మూసీ పునర్జీవం లక్ష కోట్లు ప్రజాధనం దోపీడికి వ్యతిరేకంగా గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్ చేసిన దోపిడీ ప్రణాళికలు, బాధితుల హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ముఖ్య అతిథిగా, బీఆర్ఎస్ నేత ప్రవీణ్‌కుమార్‌తోపాటు, పలువురు విద్యావేత్తలు, పర్యావరణ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ. లింబాద్రి, ఆర్పీఐ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రొ. గాలి వినోద్ కుమార్, టీఎస్‌యూ, అంసా, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల నాయకులు, మూసీ బాధితులు పాల్గొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న లక్ష కోట్ల దోపిడీకి వ్యతిరేకిస్తూ.. బాధితులకు భరోసానిచ్చేలా కార్యాచరణ ఉంటుందన్నారు.
– సిటీబ్యూరో
రేవంత్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం
– గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్
లక్ష కోట్ల ధనదాహంతో వందలా ది మందిని నిరాశ్రయులు చేస్తూ, ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే రేవంత్‌రెడ్డి ఆగడాలను అడ్డుకట్ట వేస్తాం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విద్యార్థి లోకం పోరాడుతుంది. ఒక్క ఇంటినీ కూల్చకుండా, ఒక్క కుటుంబానికి నష్టం కలిగించకుండా బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ పనులు సాగాయి. 31 ఎస్టీపీలను మాజీ సీఎం కేసీఆర్ నిర్మించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్టీపీల నిర్మాణ పనులను కొనసాగించడం లేదు. గ్రీన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను మంజూరు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పౌష్టికాహారాన్ని అందించకుండానే 120 మంది గురుకుల విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు.
తెలంగాణలో ఫాసిస్టు పాలన
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతుంటే… అదే రాజ్యాంగాన్ని రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఖూనీ చేసి, ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా, రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా, మూసీ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నారు. 10వేల కుటుంబాలకు మాత్రమే నష్టం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు వల్ల రాష్ర్టానికి వేల కోట్ల ఆదాయం వస్తుందనీ చెబుతూ రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్ల దోపిడీ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలు అడ్డా కూలీలుగా మారే ప్రమాదం ఉందని, లక్షలాది రూపాయాలు దోపీడీకి గురయ్యే అవకాశం ఉందని, 2023లోనే 5లక్షల కోట్లు తినడానికి భారీ కుట్ర జరిగింది.
ముఖ్యమంత్రి కాగానే, హోం శాఖ, విద్యాశాఖ, సాధారణ, మున్సిపల్ పాలన వంటి కీలకమైన శాఖలను ఆయన దగ్గరే ఉంచుకున్నారు. ఇక రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ శాఖలను చేతిలో పెట్టుకున్న పొంగులేటి ఇద్దరూ కలిసి రాష్ర్టాన్ని దోచుకుంటున్నారు. కాంగ్రెస్ నేత ధనదాహం లగచర్లతో బయటపడి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ ఫార్మా కంపెనీలకు కేటాయించిన భూములను సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడి కంపెనీలను బయటకు పంపించారు. ఇప్పుడు 3200 ఎకరాల మూసీ సుందరీకరణ పేరుతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నదిని పునర్జీవం చేయాలంటే కొన్నిసార్లు వెయ్యి సంవత్సరాలు కూడా పట్టవచ్చు. 400 ఏండ్ల కిందట నిర్మించిన హుస్సేన్ సాగర్ ఇప్పటికీ మురికిగానే ఉంది. థేమ్స్ నది గత 150 ఏండ్లుగా క్లీనింగ్ పనులు సాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.7లక్షల కోట్లు అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ రెండున్నరేళ్లలోనే 1.5లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ఈ దోపీడిని అడ్డుకోవడానికి అందరం కలిసి పోరాడాలి. ఫీజు బకాయిలు, 2లక్షల ఉద్యోగాలు, ఆరు గ్యారంటీలు, 420 హామీలు, తెలంగాణ కమిషన్ రిపోర్టు మీద, గురుకుల విద్యార్థుల మరణాలపై విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలి. బీఆర్ఎస్వీతో అన్ని విద్యార్థి సంఘాలు భాగస్వామ్యంతో ప్రజా వ్యతిరేక విధానాలకు నిలువరించాలి.ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత
అభివృద్ధి పేరిట పేదల బతుకులు ఛిద్రం
అభివృద్ధి పేరిట కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసంతో పేదల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోపీడీ చేసే కుట్రలను తిప్పికొట్టాలి. మూసీ నది పునర్జీవనానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. కానీ పేదల ఇండ్లను కూల్చి, వేలాది కుటుంబాలపై జరిగే విధ్వంసాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదు. లక్షలాది మూసీ బాధితులకు విద్యార్థి సంఘాలు తోడుగా ఉండటం అభినందనీయం. మాజీ సీఎం కేసీఆర్ మూసీ సుందరీకరణ కోసం శాస్త్రీయ విధానాలను రూపొందించారు.
పకడ్బందీ ప్రణాళికలతో 31 ఎస్టీపీలను నిర్మించారు. ఒక్క ఇంటినీ కూల్చకూడదని స్పష్టమైన మార్గాలను కూడా ఇచ్చిన గొప్ప మానవతావాది కేసీఆర్. కానీ డీపీఆర్ లేకుండానే లక్షల కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. భూసేకరణ చట్టం-2013 అమలు చేయకుండా, నిబంధనలు ఉల్లంఘించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. మూసీ పరీవాహక ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దీంతో ఇండ్లు కోల్పోయి వందలాది పేద కుటుంబాలు ఆశ్రయం లేకుండా పోతుంది. ప్రజల హక్కులను పరిరక్షించేలా, జీవనోపాధి రక్షణ కోసం, మూసీ బాధితుల పక్షాన విద్యార్థి సంఘాలు కలిసి ఉద్యమించాలి. సత్యం, ధర్మం వైపు నిలబడుతూ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఏర్పడింది.
– దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
విల్లాకు విల్లా పరిహారంగా ఇస్తారా?
రూ. 10 కోట్లు విలువ చేసే రిచ్మండ్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో 50 విల్లాలకు నోటీసులు అంటించారు. ప్లాట్‌కు ప్లాటు, ఫ్లాట్‌కు ఫ్లాట్ పరిహారం ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి… మరీ విల్లాల్లో ఉండే వారికి కూడా అదే తీరుగా పరిహారం ఇస్తారా? గతంలో ఉన్న 9 మీటర్ల నిబంధను ఇప్పుడు 50 మీటర్ల వరకు బఫర్ జోన్ మారింది. ఇప్పటి లెక్కల ప్రకారం ఎప్పుడో కట్టుకున్న మధు పార్క్ రిడ్జ్కు విలువే లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి… మరీ బఫర్ జోన్లో కట్టబోయే హైరైజ్లకు ఎలా విలువ కడుతారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీలను పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం… మూసీ సుందరీకరణ పేరిట జనాలను రోడ్డున మాత్రం పడేస్తున్నది. మూసీ పరీవాహకంలో ఉన్న పీ అండ్ టీ కాలనీ, నర్సారెడ్డి కాలనీ, రిచ్మండ్ విల్లాలు, హిమయత్ సాగర్ వెంబడి ఉండే ఎన్నో కాలనీల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తున్నది.
– ప్రేమ్‌కుమార్, బండ్లగూడ
అధ్యయనమే లేకుండా ప్రాజెక్టులు కడతారా?
రిచ్మండ్ విల్లాలో ఉంటున్నా మూసీ బాధితుడినే. లక్షన్నర కోట్లకు మూసీ ప్రాజెక్టును చేపడుతామని చెబుతున్నారు. మరీ ఇప్పటివరకు ఎన్ని నిధులను ప్రాజెక్టు కోసం సమకూర్చారు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, సోషియో అసెస్మెంట్ లేకుండానే ప్రాజెక్టును చేపడుతున్నారు. శాస్త్రీయ విధానంలోనే కాలుష్య కారకాలను తగ్గించి, స్థానికంగా ఉండే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించవచ్చు. 13న ప్రజెంటేషన్‌లో ఎక్కడా నదిలో చేరుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, ఫార్మా కంపెనీల రసాయనాలను అడ్డుకుంటామని చెప్పలేదు. దీంతో లెక్కకు మించిన యాంటీ బయాటిక్స్ అవశేషాలతో నదీ గర్భం కలుషితమవుతుంది. కానీ సర్కార్ మాత్రం నది పరివాహాక ప్రాంతంలో ఉండే జనాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నది. పేదలే లక్ష్యంగా కూల్చివేతలు చేపడుతున్న సర్కార్‌కు ప్రజలే బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ అవశ్యకత గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఇండ్లను కూల్చేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తున్నది.
– శరత్ బాబు, అగ్రికల్చర్ సైంటిస్ట్
ప్రాజెక్టు కోసం ఇండ్లను ఇవ్వం
సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగపడనీ మూసీ సుందరీకణ పేరిట, వందలాది ఇండ్లను కూల్చుస్తామంటే ఊరుకునేది లేదు. మూసీని పరిరక్షించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కార్‌కు గనుక ఉంటే… ముందుగా యథేచ్ఛగా చేరుతున్న మురుగునీటిని, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టాలి. పెండింగ్‌లో ఉన్న ఎస్టీపీలను పూర్తి చేసి, ఒక్క చుక్క మురుగు నీరు నదిలోకి చేరకుండా జాగ్రత్త వహించాలి. అంతే తప్ప.. ఏ మాత్రం అక్కర్లేని ప్రాజెక్టు కోసం తమ ఇండ్లును కూల్చి, వేలాది ఎకరాలను లాక్కోవాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సిందే. ఈ ప్రాజెక్టు కోసం మా ఇండ్లను, జీవితాలను కోల్పోవడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించాలి.
– విశాలక్షి, హైదర్షా కోట్
అపార్ట్మెంట్ వద్దంటే… హైరైజ్ ఎందుకు?
మార్చి 13న స్టార్ హోటల్లో పెట్టిన పీపీటీ, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరిట మూసీ ప్రాజెక్టును గందరగోళంగా కాంగ్రెస్ సర్కార్ మార్చివేసింది. ఎప్పుడో అన్ని అనుమతులతో కట్టుకున్న ఇండ్లను, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీరో వాల్యూగా ప్రకటిస్తున్నారు. మరీ మధు పార్క్ రిడ్జ్ వద్దు అంటే… ఆ ప్రాంతంలో ఎలా హైరైజ్ ప్రాజెక్టులకు
అనుమతిస్తారు.
– గీతిక, మధు పార్క్ రిడ్జ్
రేవంత్.. ల్యాండ్ చోర్
బీజేపీ దేశంలో ఓటు చోర్‌కు పాల్పడితే… అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ నగరంలో ల్యాండ్ చోర్ చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వేల కోట్ల భూములపై సర్కార్ పెద్దలు దృష్టి పెట్టారే తప్ప.. సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచన లేకుండా పోయింది. ఎంత సేపు అసైన్డ్ భూములు గుంజుకుందామా? లేక ఇండస్ట్రీయల్ ల్యాండ్ పార్శిళ్లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడదామా? మూసీ పేరిట వేల కోట్ల రూపాయాలను జేబులు నింపుకొందామా? అనే ఆలోచన తప్ప.. రేవంత్‌రెడ్డి సర్కార్ మదిలో ఇంకొకటి రావడం లేదు. పేద, మధ్యతరగతి ప్రజలను రోడ్డున పడేసి ప్రాజెక్టుల పేరిట జరిగే దోపిడీని విద్యార్థి సంఘాలుగా కచ్చితంగా అడ్డుకుంటాం. బీఆర్ఎస్వీ ఇచ్చిన పిలుపుతో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు భరోసానిచ్చేలా విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – సుమిత్, పీడీఎస్‌యూ(జీ) నేత
ఆరు గ్యారెంటీల తరహా మోసమే..
ఆరు గ్యారెంటీల అమలు చేయకుండా జనాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అసలు మేనిఫెస్టోలోని లేని మూసీ గురించి ఎందుకు ఆరాట పడుతుందనే అంతు చిక్కడం లేదు. తండాల నుంచి మూసీ పరివాహాకంలో వేలాది మంది గిరిజనులు, చిన్నాచితక పనులు చేసుకుంటూ నగరంలో జీవనం సాగిస్తున్నారు. అలా కూడబెట్టిన పైసలతో రేకుల షెడ్డుతో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ అవేవి పట్టించుకోకుండా, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూల్చేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణ చేయాలనే చిత్తశుద్ధీ గనుక ఉంటే… ముందుగా డీపీఆర్ ప్రజల్లోకి పెట్టాలి. యథేచ్ఛగా మూసీలో చేరుతున్న మురుగునీటిని అరికట్టాలి.
– రాజేశ్ , గిరిజన విద్యార్థి సంఘం