ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఉన్నత విద్యా మండలి ముందు ధర్నా నేపథ్యంలో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచి హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి వారిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించమని అడుగుతుంటే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే వచ్చే నష్టమేమిటని అన్నారు.
హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న వారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో విద్యారంగ సమస్యలు పరిష్కారమైతాయని అనుకుంటే ఇప్పటికీ సమస్యలు అలాగే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు నేటికీ ఉన్నత విద్య అందని ద్రాక్ష లాగే మారిందని వాపోయారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే… ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా కాలరాస్తుందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలో బీ – కేటగిరి సీట్లను కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలలో అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను తగ్గించాలన్నారు. డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతులను రద్దు చేయాలని అన్నారు.
యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనలను పాటించని, గుర్తింపు లేని విద్యా సంస్థల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఉదయ్ కుమార్, టీడీఎస్ఎఫ్ అధ్యక్షుడు విజయ్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్, పీడీఎస్యూ నాయకుడు మంద నవీన్, టీఎస్పీ నేత మధు యాదవ్ తదితరులు ఉన్నారు.
అక్రమ అరెస్టులను ఖండించిన విద్యార్థి సంఘాలు
రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన నిర్వహించే తలపెట్టిన విద్యార్థి నాయకుల అరెస్టుపై వివిధ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన (టీఎన్వీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే శివప్రసాద్, ఎమ్మెస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు నాగరాజు వేరు వేరు ప్రకటనలు విడుదల చేశారు.