మేడ్చల్, జనవరి 18(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల చైర్ పర్సన్స్, వార్డుల రిజర్వేషన్ల ఖరారుతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రాజకీయం వేడెక్కింది. బరిలో నిలిచేందుకు నేతల హడావుడి ప్రారంభమైంది. ఎల్లంపేట్, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు పాగా వేసేలా దృష్టి సారించాయి. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి కలిసివస్తుందని నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచే అత్యధికంగా ఆశావహులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు నాయకత్వ లోపం ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి మేడ్చల్‌లో బీఆర్ఎస్ క్యాడర్ చెక్కు చెదరలేదు.
దీనికి తోడు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశంగా మారింది. అంతేగాక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా అమలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోటీ చేసేందుకు అంతగా ఉత్సాహం చూపించడం లేదని తెలుస్తోంది. మోసపూరిత హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రజలు పేర్కొంటున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో గ్రామీణ ప్రాంతాలు ఉండటం రైతులకు ఇచ్చిన హామీలు అసంపూర్తిగా అమలు చేయడంతో అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. రైతుభరోసా, రుణమాఫీ, సన్నరకం వడ్లకు బోనస్ కొందరు రైతులకు మాత్రమే పరిమితం చేసిన నేపథ్యంలో రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే
బీఆర్ఎస్ సత్తాచాటుతాం
కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది. రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నెరవేర్చారో ప్రజలకే తెలుసు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైనే ప్రచారం చేస్తాం. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం. – మల్లారెడ్డి, ఎమ్మెల్యే, మేడ్చల్