సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ (పునర్విభజన)పై దుమారం చెలరేగుతున్నది..ఎలాంటి శాస్త్రీయత పాటించకపోవడంతో పాటు పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే వార్డులను అడ్డగోలుగా విభజించారంటూ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, కాలనీ సంఘాలు, స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో నం 570 ప్రకారంగా జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 300 వార్డులుగా విభజించి, వారం రోజుల గడువుతో ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ప్రకటన జారీ చేశారు. తొలిరోజే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ప్రజాప్రతినిధులు విచ్చేసి కమిషనర్ ముందు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు అక్బరుద్దీన్ ఒవైసీ, ముబీన్, మాజీద్ హుస్సేన్, బలాల, బేగ్ కమిషనర్ కర్ణన్‌ను కలిసి అరగంటకు పైగా చర్చలు జరిపారు. బీజేపీ కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి కమిషనర్‌ను కలిశారు. ముందస్తుగా ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించకుండా, పబ్లిక్ డొమైన్లో వివరాలు షేర్ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని కమిషనర్‌కు వివరించారు. పార్టీల నేతలతో పాటు పౌరులు సైతం నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ల ఏర్పాటులో పారదర్శకత లేదని, ఆగమాగంగా డివిజన్ల హద్దులు, మ్యాపులు లేకుండానే అభ్యంతరాలు స్వీకరించడంపై భగ్గుమన్నారు.
వార్డులోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించింది. అధికారులు మాత్రం మొదటి ప్రాతిపదికన బౌండరీలు, రెండో ప్రాతిపదికన జనాభాను బేస్ చేసుకొని వార్డుల డీలిమిటేషన్ జరిపామని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డగోలుగా వ్యవహరించినట్లు స్పష్టమవుతున్నది. వాస్తవంగా పాత జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉంటే డీలిమిటేషన్లో భాగంగా 247 వరకు సంఖ్యను తీసుకువచ్చారు. దీంతో పాటు జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 53 డివిజన్లను కొత్తగా చేర్చారు. ఈ విలీన మున్సిపాలిటీలకు సంబంధించి రెండు, మూడు వార్డులతో ముగించారు. మొత్తం 300 డివిజన్లుగా ఖరారు చేసిన అధికారులు ..ఒక్కో డివిజన్లో 40 నుంచి 50వేల జనాభాను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
కానీ చాలా డివిజన్లలో తక్కువగా 25 వేల జనాభా, ఎక్కువగా 55 వేల జనాభాతో డివిజన్లుగా కొత్తవి ఖరారు చేశారు. తూంకుంట, తెల్లాపూర్, శ్రీనగర్ కాలనీ ఇలా తక్కువ జనాభా కలిగిన డివిజన్లుగా చూపించగా…చార్మినార్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో చాలా వరకు పాత డివిజన్లను ఎలాంటి మార్పు చేయలేదు..ఇలా 42 డివిజన్లను కనీసం టచ్ చేయలేదని, ఈ రెండు నియోజకవర్గంలో రాజకీయ మతలబు లేకపోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్‌కు యథావిధిగా ఉంచినట్లు తెలుస్తోంది.
బోరబండ డివిజన్లో అదనంగా కొన్ని ప్రాంతాలను కలపడం గమనార్హం. ఖైరతాబాద్ నియోజకవర్గంతో సంబంధం లేని ప్రాంతాలను ఖైరతాబాద్ డివిజన్లో కలపడంతో తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాగా జీహెచ్ఎంసీ యాక్ట్‌ను బూచీగా చూపించి పౌరులు ముందుకు ఎలాంటి మ్యాపులు విడుదల చేయకుండా, ఆన్లైన్ అవకాశం ఇవ్వకుండా ఆగమేఘాల మీద డీలిమిటేషన్ ప్రక్రియను ముగిస్తున్న తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
300 డివిజన్లలో ఎక్కువగా సెంట్రల్ సిటీ, ఓల్డ్ సిటీలోనే అత్యధికంగా పెరగడంపై ప్రత్యేక చర్చకు దారి తీస్తున్నది. పాతనగరంలో బలంగా ఉన్న పార్టీకి సంబంధించి 72 స్థానాల వరకు సంఖ్య రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్డుల విభజనలో స్పష్టంగా రాజకీయ ప్రయోజనం దాగి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విస్తరణను రెండు కానీ మూడు భాగాలుగా చేస్తూ ప్రత్యేకంగా మిత్రపక్ష పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా లైనప్ చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ నేతలు ఆరోపిస్తున్నారు.
వార్డుల విభజనపై 16వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు, సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక సిబ్బందిని ఖరారు చేశారు. ఐతే తొలిరోజు బుధవారం నామమాత్రంగానే పౌరులు ముందుకు వచ్చారు. బౌండరీల మార్పు, అనేక వార్డులలో పేర్ల మార్పుకు సంబంధించి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఐతే అభ్యంతరాలు, సలహాలను 16 వరకు కొనసాగించి, అదే రోజున కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల సూచనలు తీసుకోవాలని భావిస్తున్నారు. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కమిషనర్ కర్ణన్ ప్రత్యేక సమావేశమయ్యారు. కౌన్సిల్లో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియకు ఆమోద ముద్ర వేసుకుని, ఆ తర్వాత ప్రభుత్వానికి వెనువెంటనే చేర్చనున్నారు. అక్కడ నుంచి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
వార్డుల విభజన ప్రక్రియపై చాలా సందేహాలున్నాయి. ఉన్న వార్డునే రెండుగా విభజించిన వాటికి సంబంధించి ఏఏ కాలనీలను ఎలా సర్దుబాటు చేశారన్నది అనుమానంగా ఉన్నది. ప్రాథమిక వివరాలను అధికారులు వెల్లడించినప్పటికీ అందుకు సంబంధించిన వార్డు మ్యాపులను ప్రకటించకపోవటంతో స్పష్టత లోపించింది. ఒకే కాలనీ సంక్షేమ సంఘాన్ని రెండు వార్డుల మధ్య విభజించినట్లుగా ప్రాథమిక వివరాల ప్రకారం తెలుస్తున్నది. అలా అయితే ఇబ్బందులు తప్పవు. అలా జరగకుండా ఒక సంక్షేమ సంఘాన్ని రెండుగా చీల్చకుండా ఒకే వార్డులో వచ్చేలా చూడాల్సిన అవసరం ఉన్నది.
– ఎర్రబెల్లి సతీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత
డివిజన్ల ఏర్పాటు క్రమ పద్ధతిలో జరగలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. డివిజన్ల ఏర్పాటు విస్తీర్ణం ప్రకారం చేశారా? జనాభా ప్రకారం చేశారో అధికారులు స్పష్టం చేయాలన్నారు. ప్రజలను గందర గోళంలో పడేస్తున్నారని ఆమె మండి పడ్డారు. డివిజన్లకు సంబంధించిన మ్యాప్‌లను డిస్ ప్లే చేయకుండానే ప్రజాభిప్రాయ సేకరణ ఏ విధంగా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే ఏక పక్షంగా డివిజన్లు ఏర్పాటు చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తప్పులు దొర్లిన దగ్గర సరిచేయవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. డివిజన్లు ఏవిధంగా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించ కుండానే కార్యాలయాల్లో కూర్చొని డివిజన్లు ఏర్పాటు చేస్తే ఇలానే తప్పులు జరుగుతాయన్నారు.
– సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే, మహేశ్వరం
నూతన వార్డుల ఏర్పాటును ప్రభుత్వం హడావిడిగా చేసినట్టుగా అనుమానాలున్నాయి. ముందస్తుగా ప్రజల ముందు ప్రతిపాదన పెట్టి ఉంటే ఎటువంటి సందిగ్ధతకు అవకాశం ఉండేది కాదు. తాజాగా ఏర్పాటు చేసిన అదనపు వార్డుల్లో కాలనీల పరంగా చాలా అస్పష్టత ఉన్నది. పూర్తి వివరాలను సరిహద్దులు, మ్యాపుల పరంగా వీలైనంత త్వరగా ప్రకటించి అయోమయానికి తెరదించాలి. ఇప్పటికే కొన్ని కాలనీ సంక్షేమ సంఘాలు విభజనపై కొంత అసంతృప్తితో ఉన్నాయి. త్వరలో అధికారులను తమ అభ్యంతరాలను తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు.
– మాధవరం రంగారావు, మాజీ కార్పొరేటర్