బెయిల్‌పై విడుదలైన వారిపై పోలీసుల నిఘా
శాశ్వతంగా మాదకద్రవ్యాలను దూరం చేసేలా కార్యాచరణ
ఉద్యోగాలు తీసేయాలంటూ లేఖలు రాయలేదన్న సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల డ్రగ్స్ కేసుల్లో అరస్టైన వినియోగదారుల ప్రవర్తన, ఎందుకు మత్తుకు బానిసయ్యారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వారిని శాశ్వతంగా డ్రగ్స్ నుంచి దూరం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
సైప్లె చైన్‌ను తెగొట్టేందుకు..
గతంలో డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేయడం వరకే పరిమితమైన పోలీసులు ఇటీవల డిమాండ్, సైప్లె చైన్‌ను తెగొట్టేందుకు వినియోగదారులను సైతం అరెస్ట్ చేస్తున్నారు. అరస్టైన వారు జైలు నుంచి బెయిల్‌పై విడులైన తరువాత వారి ప్రవర్తన ఎలా ఉందనేదానిపై నిఘా పెట్టారు. వారి కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. దీంతో డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచన చేసేందుకు చాలా మంది భయపడుతున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ వాడొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన డ్రగ్స్ స్మగ్లర్ టోనీ నెట్‌వర్క్‌ను దాదాపు ధ్వంసం చేయగా, లక్ష్మీపతికి డ్రగ్స్ విక్రయించే నాగేశ్వర్రావుకు సంబంధించి 10 రాష్ర్టాల్లోని పూర్తి నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించి, నెట్‌వర్క్‌లోని స్మగ్లర్లు, పలువురు వినియోగదారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఎవరినీ వేధించం
డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేయడంలో భాగంగా డ్రగ్స్ సరఫరా చేసే వారితో పాటు డ్రగ్స్‌ను తీసుకుంటున్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నాం. దీంతో డిమాండ్, సైప్లె చైన్‌ను తెగొట్టేందుకు అవకాశముంటుంది. డ్రగ్స్ కేసుల్లో అరస్టైన ఐటీ, ఇతరత్రా ఉద్యోగులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడమే ప్రధాన ధ్యేయం. వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని లేఖలు రాసి వేధించాల్సిన అవసరం లేదు.
– హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీవీ ఆనంద్
ఎక్కడా తొలగించలేదు
డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన ఐటీ ఉద్యోగులను ఆయా సంస్థలు తొలగించాయని గురువారం పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చినట్లు విన్నాం. కానీ సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో అలాంటి తొలగింపులు ఎక్కడా జరుగలేదు.
– ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల