ORR | సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ):హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై అంధకారం అలముకున్నది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీధి దీపాలు ఎంతో ముఖ్యం. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వీధి దీపాలను 158 కి.మీ పొడవునా ఏర్పాటు చేసింది. అయితే నిర్వహణ లోపం కారణంగా అవి రాత్రి పూట వెలగడం లేదు.
అసలే ఔటర్‌పై తరచూ ప్రమాదాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔటర్ నిర్వహణను సరిగా చేయకపోవడం వల్లే రాత్రి వేళల్లో ప్రధాన రహదారిపై పూర్తి స్థాయిలో దీపాలు వెలగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. రాత్రి వేళల్లోనే ఔటర్‌పై ఎక్కువగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి సమయంలో వీధి దీపాలు వెలగకపోతే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రధానంగా దృష్టి సారించి ఓఆర్ఆర్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.