GHMC | సిటీబ్యూరో/నెట్వర్క్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. బస్తీలు, కాలనీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని చోట్ల క్రూర మృగాల్లా రెచ్చిపోతూ.. పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. గత నెల 6న మియాపూర్‌లో ఆరేండ్ల సాత్విక్‌ను వీధి కుక్కలు చంపేశాయి. మొన్న చిత్రపూరి కాలనీలో వాకింగ్ చేస్తున్న గృహిణిపై కుక్కల మంద దాడి చేసి గాయపరిచాయి.
అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో వీధి కుక్కలు స్కూల్‌కు వెళ్లే చిన్నారులపై దాడిచేయగా, ఓ బాలుడు చనిపోయాడు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదేండ్ల దీపాలి ఆడుకుంటుండగా.. కుక్కలు దాడిచేయగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. జవహర్‌నగర్‌లో ఓ బాలుడిని కొరికి చంపేశాయి.
ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇలా వీధి కుక్కలు చిన్నారుల పాలిట మృత్యుమృగాలుగా మారుతున్నాయి. నిత్యం గ్రేటర్లో ఏదో ఒక చోట ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలంటూ జీహెచ్ఎంసీకి రోజూ 98కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్నిపార్టీల ప్రజాప్రతినిధులతో ఏర్పడిన హైలెవల్ కమిటీ విధానాలు బుట్టదాఖలయ్యాయి.
తాజాగా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ సమీక్ష నిర్వహించి జోనల్ స్థాయి కమిటీలు, షెల్టర్ హోంలు, వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. కానీ జనాలకు కుక్కల కాట్లు మాత్రం తప్పడం లేదు. నారాయణగూడ ఐపీఎంకి రోజూ 250 నుంచి 300 మంది వరకు, ఫీవర్ దవాఖానకు నెలకు 2 వేల మందికిపైగా కుక్క కాటు బాధితులే వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కోట్లు ఖర్చు చేస్తున్నా..
గ్రేటర్లో ఐదు చోట్ల జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఏడాది కిందట 5.7 లక్షల కుక్కలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబీస్ (ఏఆర్) కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒక్క కుక్కకు కు.ని శస్త్ర చికిత్స చేసేందుకు దాదాపుగా రూ. 300 వరకు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి కుక్కలను పూర్తిస్థాయిలో గుర్తించి.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు సక్రమంగా పూర్తిచేస్తే… వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉండదు.
18,618 మంది బాధితులు
నల్లకుంటలోని ఫీవర్ దవాఖానలో నెలకు రెండు వేలకు పైగా కుక్కకాటు కేసులు వస్తున్నాయి. గడిచిన ఏడు నెలల్లో 18,618 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి పరిశీలిస్తే…జనవరిలో 2731, ఫిబ్రవరిలో 2548, మార్చిలో 2644, ఏప్రిల్‌లో 2709, మే నెలలో 2789, జూన్ నెలలో 2607, జూలైలో ఇప్పటి వరకు 2590 కేసులు నమోదయ్యాయి. అలాగే నారాయణగూడలోని ఐపీఎంలో 2024 జనవరి నుంచి జూలై 31 వరకు 7 నెలల వ్యవధిలోనే 19,854 కేసులు నమోదయ్యాయి.
ఐపీఎంలో ప్రతిరోజు 250 నుంచి 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కుక్కకాటు బారిన పడిన ప్రతి ఒక్కరికి మొదటి రోజు.. ముడో రోజు.. ఏడో రోజు.. 28వ రోజు నాలుగు విడతాల్లో 2 ఎంఎల్ యూనిట్స్ ఎడమ చేతికి 1 ఎంఎల్..కుడి చేతికి 1 ఎంఎల్ యూనిట్స్ ఇంజక్షన్ ఇస్తున్నారు. కాగా, జైపూర్, గోవాల్లో ఏబీసీ కార్యక్రమాల అమలు బాగుందనే అభిప్రాయాలున్నాయి.
అక్కడ ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలో (5-12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేస్తారని, ‘మిషన్ రేబిస్’ పేరిట వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తారని జంతు ప్రేమికులు చెబుతున్నారు.
డాక్టరై సేవ చేస్తాడని కలలు కంటే…
బతుకు దెరువు కోసం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామం నుంచి జవహర్‌నగర్ బాలాజీనగర్‌కు వచ్చిన పుల్లూరి భరత్‌కుమార్, వరలక్ష్మి దంపతులు ఇద్దరు కూతుర్లు సాహీతి(12), శ్రుతి(10), కుమారుడు విహాన్(16 నెలలు)తో కలిసి బంధువుల ఇంట్లో నివాసముంటున్నారు. భరత్‌కుమార్ స్థానికంగా కార్పెంటర్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
బంధువుల ఇంట్లో ఎంతకాలం ఉంటామని… మరో ఇంటిని కిరాయికి తీసుకొని.. పిల్లలను పాఠశాలలో వేద్దామనుకున్నాడు. ఇంతలోనే ఈనెల 16న జవహర్‌నగర్ ఆదర్శకాలనీలో కుమారుడు విహాన్‌ను వీధి కుక్కలు నోట్లో కరుచుకొని.. కొంత దూరం లాకెళ్లి..పీక్కుతినడంతో ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది. కుమారుడిని కష్టపడి చదివించి డాక్టర్‌ను చేద్దామనుకుంటే వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్నాయని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూలి పనులు చేసుకుంటేనే కుటుంబం గడుస్తుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎనిమిల్ కేర్ సెంటర్లో ఏం చేస్తున్నారంటే..
జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు యానిమిల్ కేర్ సెంటర్లు ఉండగా..కాలనీలు, బస్తీల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతి రోజు సుమారు 40 నుంచి 50 వీధి కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్‌కు తీసుకొని వస్తున్నారు. ఆడ, మగ కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ (ఏబీసీ) చేస్తున్నారు. ఆపరేషన్ అనంతరం కుక్క కుడి చెవి చివరన వీ షేప్‌లో కట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి కుక్కకూ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్) ఇస్తారు. వ్యాక్సిన్ హ్యుమినిటీ సంవత్సరం పాటు ఉంటుంది.
ప్రతిసారీ 4-8 పిల్లలు
అశ్రద్ధ చేయొద్దు
-డాక్టర్ శివలీల(డైరెక్టర్, ఐపీఎం నారాయణగూడ)
వీధి కుక్కలతో పిల్లలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎంలోని కుక్క కాటు బాధితులకు అన్ని విధాల యాంటీ రేబిస్ వాక్సినేషన్ అందుబాటులో ఉంది. కుక్క కరిచి ఎక్కువ రక్తం వచ్చే వారు అశ్రద్ధ చేయకుండా ఇమ్యోనోగ్లోబులిన్స్ ఇంజక్షన్‌ను తీసుకోవడానికి కోరంటి దవాఖానను పంపిస్తాం. వేసవిలో కుక్క కాటు బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వం పట్టించుకోలే
– సాత్విక్ తండ్రి వీరేశ్ (మియాపూర్)
మా బాబు సాత్విక్ వీధికుక్కల దాడిలో ప్రాణాలు వదిలాడు. పాఠశాలకు వెళ్లి సాయంత్రం అటునుంచి డంప్ యార్డుకు వెళ్లిన తమ చిన్నారి సాత్విక్‌పై వీధి శునకాలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. నాటి నుంచి నేటి వరకు మా కుటుంబాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కాలనీ వాసులు తలా కొంత వేసుకుని ఆర్థిక సాయాన్ని అందించారు.
4 సార్లు ఇంజక్షన్ తీసుకోవాలి…
-సచిన్(ఆదిలాబాద్)
వారం రోజుల కిందట ఆదిలాబాద్‌లో వీధి కుక్క కరిచింది. నారాయణగూడలోని ఐపీఎంలో యాంటీ రేబిస్ వాక్సినేషన్ ఇచ్చారు. నాలుగు సార్లు ఈ యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
కుక్కల బెడదను భరించలేకపోతున్నాం
– సరిత, నార్త్ ఎన్సీఎల్ కాలనీ, కొంపల్లి
కొంపల్లి నార్త్ ఎన్సీఎల్ కాలనీలో కుక్కల బెడదను భరించలేకపోతున్నాం. రెండుసార్లు నన్ను గాయపరిచాయి. నా కూతురు తన్విహను సైతం గాయపర్చాయి. కాలనీలో వీధికుక్కల బెడదతో చాలామందికి గాయాలయ్యాయి.
ప్రజలు సహకరించాలి
కుక్కలను నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు కోరుతున్నారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా కు.ని. శస్త్ర చికిత్సలు సక్రమంగా చేస్తున్నామన్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి కుక్కలు నగరంలోకి ప్రవేశించి… కాలనీలు, బస్తీల్లో సంచరిస్తున్నాయి. ఇండ్లలో వెలువడే ఆహార పదార్థాలను రోడ్డుపై, చెత్తకుప్పల్లో వేయడం మానుకోవాలి. వీధి కుక్కలతో ఇబ్బందులు ఏర్పడితే వెంటనే 040-2311 1111 ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.