సిటీబ్యూరో/చిక్కడపల్లి డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలో రెండు చోట్ల చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన నేపథ్యంలో ఇటు ప్రజలు, ఇతర పలు సంఘాల తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి.
వాస్తవంగా గ్రేటర్లో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి? స్టెరిలైజేషన్ పారదర్శకంగా జరుగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వరుసగా చిన్నారులపై జరుగుతున్న వీధి కుక్కల దాడి…మరో వైపు రోజుకు పదుల సంఖ్యలో జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబరుకు వస్తున్న ఫిర్యాదులు.. వీధి కుక్కల నియంత్రణ ప్రక్రియపై సందేహాలు వస్తున్నాయి. వీధి కుక్కల నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీల్లో ఎక్కువ భాగం జంతు ప్రేమికుల సంఘాలవే అని, ఈ సంఘాలు వీధి కుక్కల నుంచి మనుషులను కాపాడడం కంటే వీధి కుక్కలను రక్షణ మీదనే దృష్టి పెడుతూ నిధులన్నీ కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4లక్షల వీధి కుకలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 77 శాతం కుకలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెకలు చెబుతున్నాయి. కుకల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఐదేండ్లలో రూ.40కోట్లపైనే ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గతేడాది లెక్కలను పరిశీలిస్తే చార్మినార్ జోన్ పరిధిలో ఉన్న వీధి కుక్కలతో పోలిస్తే, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో మూడో వంతు మాత్రమే ఉన్నప్పటికీ, స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ కూడా సగమే జరిగినప్పటికీ ఖర్చు మాత్రం మూడు రెట్లు అధికంగా జరిగింది. జోన్ల మధ్య ఇంత తేడా ఉండడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నది.
జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణ పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, వెటర్నిరీ విభాగంపై జంతు ప్రేమికుల సంఘాల ఆధిపత్యాన్ని నివారించాలని హైదరాబాద్ సిటిజన్ ఫోరం(హెచ్‌సీఎఫ్)డిమాండ్ చేసింది.ఆదివారం బాగ్‌లింగంపల్లిలో హెచ్‌సీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్భన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం.శ్రీనివాస్‌లు, హెచ్‌సీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస రావు, వీరయ్యలు మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వీధి కుక్కల దాడితో ఈ వారంలోనే ఇద్దరు బాలురు తీవ్రంగా గాయాల పాలయ్యారని తెలిపారు. ప్రతినిత్యం ఇలాంటి ఘటనలు నగరంలో అనేకం జరుగుతున్నాయని వివరించారు.
సుప్రీం కోర్టు తీవ్రంగా స్పదించిన తర్వాత కూడా గ్రేటర్ పరిధిలో వీధి కుక్కల నివారణపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెటర్నరీ విభాగం తమ బాధ్యతను వదలించుకుని వీధి కుక్కల నిర్వహణ మొత్తం జంతు ప్రేమికుల సంఘాలకు, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పజెప్పిందన్నారు. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు కుమ్మక్కై కాకి లెక్కలు చెబుతూ నిధులన్నీ కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా కోట్లాది రూపాయిల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ వీధి కుక్కల నియంత్రణ జరగడం లేదని చెప్పారు. గత ఐదేళ్లలో జీహెచ్ఎంసీ లో వీధి కుక్కల నియంత్రణ పై వెచ్చింని నిధులు ఎన్ని, వీధి కుక్కల సంఖ్య ఎంత తగ్గింది, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని నివేదికను ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
