సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ): వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్‌నగర్‌లో బాలుడు ప్రేమ్‌చంద్..నేడు యూసుఫ్‌గూడ లక్ష్మీ నరసింహనగర్‌లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులను మొదలుకొని మహిళలు, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. బయట మనిషి కనిపిస్తే చాలు.. కరిచి పడేస్తున్నాయి..పగబట్టినట్లే ప్రవర్తిస్తూ కండలు పీకేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి.
నిత్యం ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు బలవుతున్న పరిస్థితి. నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)కు కుక్క కాట్లతో దాదాపు వంద మందికి పైగా బాధితులు క్యూ కడుతున్నారంటే కుక్కల బెడత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎంకు కొత్తగా 33,765 మంది కుక్కకాటు బాధితులు రావడం, మరో 60,440 మంది ఇప్పటికే చికిత్స తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏడాదిలో 94వేల మందికిపైగా కుక్క కాటుకు గురైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఘనత వహించిన జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది.
తూతూ మంత్రంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు..ప్రధానంగా వీధి కుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్) ఆపరేషన్లే కాకుండా, రేబిస్ నివారణ టీకాలను వేయడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోంది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు మూడు జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అయితే వీధి కుక్కల దాడి చేయడానికి హోటళ్లు, ఇండ్లలోని వ్యర్థాలను రోడ్ల పక్కన పడేస్తుండడం, వాటిని తిన్న ఈ కుక్కలు కనిపించిన వారిపై దాడికి దిగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4లక్షల వీధి కుకలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 77 శాతం కుకలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెకలు చెబుతున్నాయి.కుకల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఐదేండ్లలో రూ.40కోట్లపైనే ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70 శాతం కుకలకు ఆపరేషన్లు కూడా చేయలేదని అధికారిక లెకలు వెల్లడిస్తున్నాయి. ఒక కూకట్పల్లి జోన్ పరిధిలోనే ఐదేండ్ల కాలంలో రూ.8.50కోట్లు కేటాయిస్తే రూ.6.95కోట్లు ఖర్చుచేశారు. అంటే మిగిలిన జోన్లలో సుమారుగా రూ.7 కోట్ల చొప్పున రూ.40కోట్లపైనే ఉంటుందని అధికారులంటున్నారు. ఇక వీధి కుకలకు సంబంధించిన ఫిర్యాదులు 50వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఒక కూకట్ పల్లి జోన్ పరిధిలో 4వేలకుపైగా ఉన్నట్లు అధికారిక లెకలు స్పష్టం చేస్తున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని వీధి కుకలు ఉన్నాయని అధికారుల వద్ద సరైన లెక్కలు లేవు. అందుకు సర్వే చేయకపోవడమే కారణం 2023లో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెకల ప్రకారం సుమారు 4 లక్షలు అని చెబుతున్నారు తప్ప కచ్చితమైన లెకల్లేవనే విమర్శలున్నాయి. దీంతోపాటు వీధి కుకల నియంత్రణ, వ్యాక్సినేషన్ పేరుతో కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెడుతున్నా.. ఫలితం లేకుండా పోతున్నదని ప్రజా సంఘాల నేతలు, పలు పార్టీల నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.