కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని, ఆ కోవలోకి వైద్యరంగమూ చేరిందన్న విమర్శలొస్తున్నాయి. కీలకమైన వైద్యరంగాన్ని విస్మరిస్తుండటంతో పేద ప్రజలకు సర్కారు వైద్యం దూరమయ్యే అవకాశమున్నది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పెద్దాసుపత్రులకు సరఫరా చేసే పరికరాలు, మందుల పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లెయర్స్.. ప్రభుత్వాసుపత్రుల్లో పరికరాల సరఫరాను మార్చి నుంచే నిలిపేసినట్లు తెలిపారు. బతిమాలినా కూడా రూ.42 కోట్ల బకాయిలు విడుదల చేయడంలేదు. దీంతో మార్చి నంచి చేసేదేమీ లేక సరఫరా నిలిపేశారు. ప్రభుత్వ తీరుతో పేదలు ఇబ్బందులుపడాల్సి వస్తున్నది. మందులు, చికిత్స పరికరాల కోసమని ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించకుండా మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. అందుకే మార్చి నుంచి సరఫరా నిలిపేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. పేదప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇన్నిరోజులు ఆలస్యమైనా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చెల్లించాల్సిందే.
– కేబీ రామచంద్ర, ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లెయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పెద్దాసుపత్రులకు ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లెయర్స్ అసోసియేషన్‌కు చెందిన 35 మంది సప్లెయర్స్ నిత్యం సర్జరీ పరికరాలు, డయాగ్నోస్టిక్ పరికరాలు, మెడిసిన్ సరఫరా చేస్తుంటారు. వారు సరఫరా చేసేవాటిల్లో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, పేట్లబుర్జ్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రి ఉండటం గమనార్హం.
ఆ ఆసుపత్రులకు సూపర్‌స్పెషాలిటీ స్థాయి పరికరాలను సరఫరా చేస్తున్నారు. వాటిల్లో ప్రధానంగా ఆర్థోపెడిక్, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ ఇంప్లాంట్స్, కార్డియాలజీ, యూరాలజీ, నెప్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, డెంటల్ చికిత్సలకు అవసరమైన పరికరాలతో పాటు డయాగ్నోస్టిక్ డిస్పెన్సరీ కిట్లు, మందులు ఉన్నాయి. అయితే వీటన్నింటికి చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకుండా విస్మరించడంతో రూ.42కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
వాటిలో గాంధీ రూ.15 కోట్లు, ఉస్మానియా రూ.11కోట్లు, నిలోఫర్ రూ.13కోట్లు, పేట్లబుర్జ్ రూ.2కోట్లు, మెటర్నిటీ ఆసుపత్రి రూ.1 కోటి చొప్పున సరఫరాదారులకు చెల్లించాల్సి ఉంది. అవి మొత్తం కలిపి నేటికి రూ.42కోట్ల పెండింగ్ బకాయిలుగా మిగిలాయి. వాటిని చెల్లించాలంటూ సరఫరాదార్లు అనేకసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకునే నాథుడు లేడు.
పేదప్రజల ప్రాణాలు కాపాడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరఫరా నిలిపేయడం ఇష్టం లేక ఇన్ని రోజులు ఓపికతో ఉన్నారు. కానీ నేడు అప్పులు పెరగడం మూలంగా సరఫరాదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ఏడాది మార్చి నుంచి సరఫరా నిలిపేశారు. అపరాత్రైనా, అర్థరాత్రైనా కూడా అత్యవసర సమయాల్లో అసవరమున్న పరికరం, మెడిసిన్ అందించారు. టీజీఎంఎస్ఐడీసీ లో లేని మందులను కూడా వీరే తీసుకొచ్చి మరీ రోగి ప్రాణాలు కాపాడిన దాఖలాలున్నాయి.
పేరున్న పెద్దాసుపత్రుల్లో మెటిరియల్ నిలిచిపోతుంటే మరోవైపు వైద్యారోగ్యశాఖ మంత్రి స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. తమ సమస్యను పరిష్కరించి బకాయిలు చెల్లించాలని అనేకసార్లు మంత్రిని, అధికారులను కలిసినా ఫలితం శూన్యమైంది. కాంగ్రెస్ తీసుకునే విధానపరమైన నిర్ణయాల మూలంగా పేదలకు వైద్యం దూరమవుతోంది.
ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వసతులు, పరికరాలు, మెడిసిన్ ఉండవనే నమ్మకాన్ని ప్రజల్లో కలిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వలేకుండా ఉచిత వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి మెట్లేక్కే పేదవాడికి నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికే పలురకాల పరికరాలు, మెడిసిన్ ప్రభుత్వాసుత్రుల్లో లేకపోవడం మూలానా రూ.వేలు ఖర్చుపెట్టి ప్రైవేట్‌లో చూయించుకుంటున్నా రు. ప్రభుత్వం స్పందించి సప్లెయర్ల సమస్యను పరిష్కరించకుంటే మాత్రం కచ్చితంగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వైద్యం ప్రైవేట్ పరమవుతుంది.