సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్‌లో భారీ లాభాలిప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రతి రోజు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.3 కోట్ల కంటే ఎక్కువగా సైబర్‌నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ట్రేడింగ్ మోసాలలో బాధితులంతా అత్యాశకు పోయి మోసపోతున్న వారే ఉండడం ఆందోళన కల్గిస్తోంది. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను అడ్డగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ స్టాక్ ట్రేడింగ్ ప్రకటనలను చూసి, లింక్‌లు క్లిక్ చేస్తూ నేరగాళ్లు వేసే వలలో చిక్కుతున్నారు. ఆ తరువాత కొంత మొత్తం పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుందామని వెళ్లేవారు కొందరైతే.. సైబర్‌నేరగాళ్లు చెప్పేది నిజమని నమ్మి పెట్టుబడి పెట్టేవాళ్లు కొందరు ఉంటున్నారు.
సైబర్‌నేరగాళ్లు స్టాక్ ట్రేడింగ్ మోసాలు చేసేందుకు రోజు రోజుకు కొత్త కొత్త ఎత్తులతో సోషల్‌మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ ప్రకటనలలో ఏఐ ఆధారిత వీడియోలను సైతం తయారు చేస్తూ, ప్రముఖల వీడియోలు తయారు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి వీడియోలు, ప్రతిపక్ష నాయకుల వీడియోలు, ప్రముఖ సంస్థల ప్రతినిధుల వీడియోలను తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కువగా రిటైర్డు ఉద్యోగులు మోసపోతుండడం ఆందోళన కల్గిస్తోంది. ట్రై పోలీస్ కమిషనరేట్లలోని సైబర్ఠాణాలకు వచ్చే ఫిర్యాదులలో 70 శాతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంటుంది. అందులో ఒక్కో కమిషనరేట్‌లో ప్రతి రోజు కోటి నుంచి రూ.1.5 కోట్లకుపైగా మోసపోతున్న కేసులు నమోదవుతున్నాయి. వీటిని ఆరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సిన అవసరముంది. అయితే స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసపోతున్న వాళ్లంతా విద్యావంతులే ఉండడం గమనార్హం.
వనస్థలిపురంలో నివాసముండే బాధితుడు ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా 10క్రిక్.కామ్ అనే వెబ్సైట్ కనిపించింది. దానిని క్లిక్ చేయడంతో వాట్సాప్ గ్రూప్‌కు యాడ్ అయ్యింది. ఆ గ్రూప్‌లో అందరు తాము ఫలాన స్టాక్‌లో పెట్టుబడి పెడితే ఇంత లాభం వచ్చిందంటూ చెప్పుకుంటున్నారు. ఆ మేసేజ్‌లను చూసిన బాధితుడు నిజమని నమ్మి 10క్రిక్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. మొదట రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడంతో అందులో నుంచి రూ.వెయ్యి విత్ డ్రా చేసుకున్నాడు. లాభాలు వస్తున్నాయనే నమ్మకం కుదరడంతో దఫదఫాలుగా రూ. 67.83 లక్షలు పెట్టుబడి పెట్టాడు.
స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తున్నా, విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో రూ. 20.79 లక్షలు కమిషన్ చెల్లించాలని షరత్ విధించడంతో వాటిని కూడా చెల్లించాడు. దీంతో ఇలా మొత్త రూ.67.83 లక్షలు బాధితుడు మోసపోవడంతో మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సైనిక్‌పురికి చెందిన నిరుద్యోగి ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా స్టాక్ ట్రేడింగ్ వీడియో కనిపించింది. దానిని క్లిక్ చేయడంతో వాట్సాఫ్‌లో ‘ఎస్ సెక్యూరిటీస్ డి-44’ అనే పేరుతో ఉన్న గ్రూప్‌కు బాధితుడి నెంబర్ యాడ్ అయ్యింది. దీంతో బాధితుడికి స్టాక్స్ గూర్చి మేసేజ్‌లు పంపిస్తూ, గూగుల్ ఫామ్ పంపించారు, అందులో స్టాండెండ్ చార్టెడ్ గ్రూప్ 10 హై నెట్ వర్త్ డెవెలప్మెంట్ ప్రొగ్రామ్ గూర్చి వివరిస్తామని వివరాలు పంపించాలని సూచించారు.
దీంతో బాధితుడు ఫారమ్ నింపి పంపించడంతో యాప్‌ను డౌన్లోడ్ చేయించి, అందులో అకౌంట్ క్రియేట్ చేయించారు. మీరు పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మిస్తూ రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టాంచారు. స్క్రీన్‌పై రూ. 23.14 లక్షలు కనిపించడంతో వాటిని విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించడంతో సైబర్‌నేరగాళ్లు నిరాకరించారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు చేయడంతో మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): వన్‌టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ మాట్లాడినట్లు సైబర్‌నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ్మి రూ.31 లక్షలు పొగొట్టుకున్నాడు. సైనిక్పురికాలనీకి చెందిన బాధితుడు ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా వీడియో కన్పించింది. ఆ వీడియోను చూసి లింక్ క్లిక్ చేశాడు. వెబ్ట్రేడ్. రివోక్స్మార్కెట్స్. కామ్ అనే వెబ్‌సైట్‌కు రిడైరెక్ట్ అయ్యింది.
అందులో తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని బాధితుడు అకౌంట్ క్రియేట్ చేసుకోవడంతోనే సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. ఇదంతా రోలెక్స్ మార్కెట్ ఫ్లాట్ ఫామ్ అని, ఇందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మించారు. మొదట రూ.18 వేలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత సోపియా అనే ఒక మహిళ ఫోన్ చేసి తరుచు మాట్లాడుతూ మీ పెట్టుబడి రెట్టింపయ్యిందని నమ్మిస్తూ, మరింత పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని చెబుతూ దఫ దఫాలుగా రూ. 31.93 లక్షలు పెట్టుబడి పెట్టించింది. స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తుండడంతో వాటిని విత్ డ్రా చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించగా నెల రోజులు పూర్తయిన తరువాతే విత్ డ్రాకు వీలుంటుందని సూచించింది. నెల రోజుల తరువాత ఫోన్ చేస్తే స్వీచాఫ్ అయ్యింది. దీంతో ఇదంతా మోసమని గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.