గ్లాస్గో : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. గ్లాస్గో గడ్డపై మన లిఫర్లు పతకాల మోత మోగిస్తున్నారు. మణిపూరి మాణిక్యం మీరాబాయి చాను హ్యాట్రిక్ స్వర్ణంతో అందించిన జోష్‌ను కొనసాగిస్తూ మరో ముగ్గురు లిఫ్టర్లు సోమవారం పతకాలు గెలిచారు. చాను స్ఫూర్తితో లిఫ్టర్‌గా మారిన చత్తీస్‌గఢ్ అమ్మాయి జ్ఞానేశ్వరి యాదవ్, తమిళనాడుకు చెందిన రోజు కూలీ కొడుకు ముత్తుపాండి రాజా మెగా గేమ్స్ అరంగేట్రంలోనే వెండి పతకాలతో మెరిశారు. మణిపూర్‌కే చెందిన బింద్యారాణి దేవి కాంస్యంతో సత్తా చాటింది. దాంతో గేమ్స్‌లో భారత్ నెగ్గిన మెడల్స్ సంఖ్య ఆరుకు చేరుకుంది.
సోమవారం జరిగిన మహిళల 53 కేజీ కేటగిరీ ఫైనల్లో జ్ఞానేశ్వరి మొత్తం 199 కిలోల (స్నాచ్ 88, క్లీన్ అండ్ జర్క్ 111) బరువుమోసి రెండో స్థానంతో రజతం అందుకుంది. నైజీరియాకు చెందిన ఒమొలొలా దిదియా 206 కిలోల (స్నాచ్ 88, క్లీన్ అండ్ జర్క్ 111) గేమ్స్ రికార్డు బద్దలు కొట్టి స్వర్ణం అందుకుంది. కెనడా లిఫ్టర్ గ్రొలుక్స్ 178కేజీలతో కాంస్యం గెలిచింది. ఫైనల్లో దిదియా, జ్ఞానేశ్వరి ఇద్దరూ ప్రతీ ప్రయత్నంలోనూ విజయవంతమయ్యారు. అయితే నైజీరియా లిఫ్టర్ ఆరంభం నుంచే అగ్రస్థానంలో దూసుకెళ్లగా.. జ్ఞానేశ్వరి వెండి పతకం కోసం పోటీ పడాల్సివచ్చింది. భారత లిఫ్టర్ స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీలను ఈజీగా క్లియర్ చేసింది. కానీ, దిదియా 93 కిలోల బరువెత్తి గేమ్స్ రికార్డుతో టాప్ ప్లేస్ సాధించింది.
జర్క్‌లో భారత లిఫ్టర్ రెండో ప్రయత్నంలో 107, ఆపై 111 కిలోలతో గేమ్స్ రికార్డు నెలకొల్పగా.. దిదియా చివరి ప్రయత్నంలో ఏకంగా 113 కేజీలను క్లియర్ చేయడంతో జర్క్‌లోనూ గేమ్స్ రికార్డు ఆమెదే అయింది. ఇక, మహిళల 58 కేజీ కేటగిరీలో బింద్యా 199 కిలోల (స్నాచ్ 87, జర్క్ 112) మూడో స్థానంలో నిలిచింది. నైజీరియా లిఫ్టర్ రఫియతు లవాల్ మొత్తం 229 కిలోలతో (103+126) గేమ్స్ రికార్డుబ్రేక్ చేసి పసిడి నెగ్గగా.. కెనడాకు చెందిన అన్ సోఫీ (215) రెండో స్థానంతో సిల్వర్ గెలిచింది. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 65 కిలోల కేటగిరీలో మొత్తం 286 కేజీలతో రెండో స్థానంతో ముత్తుపాండి వెండి నెగ్గాడు. స్నాచ్‌లో 126, జర్క్‌లో 160 కేజీలను మోశాడు. ముహమ్మద్ అజ్నిల్ బిదిన్ ( మలేసియా-299 కేజీ) స్వర్ణం, రియా బరు (పపువా న్యూగినియా-282 కేజీ) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.

నాలుగేండ్లలో మూడు క్లిష్టమైన శస్త్రచికిత్సలు.. వెంటాడిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు.. వీటన్నింటికీ తోడు అప్పుల్లో కూరుకుపోయిన పేద కుటుంబం. ఇన్ని ప్రతికూలతల నడుమ తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ 26 ఏండ్ల ముత్తుపాండి రాజా అద్భుతం చేశాడు. తనకు ఎదురైన కష్టాలన్నింటినీ ఎత్తిపడేసిన ఈ కూలీ బిడ్డ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతకాంతులు విరజిమ్మాడు. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగపురం రాజా స్వగ్రామం. తండ్రి లారీ లోడింగ్ పనులతో పాటు అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తుండగా, తల్లి స్థానిక మిఠాయిల దుకాణంలో శుభ్రం చేసే పనికి వెళ్లేది. అన్న కూడా ప్రారంభంలో వెయిట్‌లిఫ్టర్‌గా ప్రయాణం ప్రారంభించినప్పటికీ, కుటుంబ పేదరికం కారణంగా క్రీడను వదిలేసి కూలీ పనుల్లో స్థిరపడ్డాడు. తమ్ముడు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో అన్న చేసిన త్యాగం రాజా కెరీర్‌కు పునాదిగా మారింది. అయితే గాయాలకు చికిత్సలు, కుటుంబ నిర్వహణ కోసం సుమారు రూ. 12 లక్షల దాకా అప్పులు కావడంతో ఒక దశలో రాజా కూడా తన ఆట ముగించి వేరే పనిలోకి వెళ్లాలని భావించాడు.
2019 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతుండగా కుడిమోచేతి లిగమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో రాజా కష్టాలు మొదలయ్యాయి. దానికి శస్త్రచికిత్స అవసరమైంది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా కోలుకోవడం ఆలస్యమై 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ అర్హతను కొద్దిలో కోల్పోవడం అతడిని కుంగదీసింది. కొన్నాళ్లకే అపెండిసైటిస్ రావడంతో రెండోసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తీవ్రమైన కామెర్లు, డెంగ్యూ బారిన పడటంతో బరువు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితిని కూడా ఎదుర్కొన్నాడు. 2023 నేషనల్స్‌లో ఎడమ కాలి లిగమెంట్ దెబ్బతినడంతో మూడోసారి ఆపరేషన్ టేబుల్ ఎక్కాల్సి వచ్చింది. ఈ వరుస ఎదురుదెబ్బలతో దాదాపు 10 నెలలు ఆటకూ, శిక్షణకూ దూరమై తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. కానీ, గో స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారం, నేషనల్ కోచ్ విజయ్ శర్మ మార్గదర్శకత్వంలో రాజా సరికొత్త ఉత్సాహంతో రీఎంట్రీ ఇచ్చాడు. 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గాడు. నేషనల్స్‌లో 65 కేజీల విభాగంలో 302 కేజీలు ఎత్తి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు కామన్వెల్త్ వేదికపై రజతం గెలిచి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. తన పర్సనల్ బెస్ట్ 302 కేజీల మార్కును చేరుకోలేక స్వర్ణం చేజారినందుకు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆరేండ్ల పోరాటానికి దక్కిన ప్రతిఫలంగా ఈ పతకాన్ని తన తల్లిదండ్రులకు, కోచ్‌లకు అంకితమిచ్చాడు.
పురుషుల 200 మీటర్ల బటర్‌ైప్లె ఈవెంట్లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. 1:58.59 సెకన్లతో హీట్‌ను ముగించి ఆరో స్థానంతో నిలిచి ముందంజ వేశాడు. ఇక, శశికుమార్, అనీశ్, నెహ్రా, శ్రీహరి నటరాజన్‌తో కూడిన భారత బృందం 4X200 మీటర్ల ప్రీస్టయిల్ రిలే ఫైనల్లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ 8.01 మీటర్లు దూకి గ్రూప్-ఏ నుంచి నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. గ్రూప్-బీ నుంచి మరో భారత అథ్లెట్ లోకేశ్ సత్యనాథన్ 7.77 మీటర్లు క్లియర్ చేసి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో భాగంగా జరిగిన విమెన్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ సమంత ఏడో స్థానంతో నిరాశపరిచింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి అర్ధాంతరంగా వదిలేసిన క్రీడా కలను నిజం చేయాలన్న తపన.. దిగ్గజ లిఫ్టర్ మీరాబాయి చాను అందించిన స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏండ్ల జ్ఞానేశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. జ్ఞానేశ్వరి తండ్రి దీపక్ యాదవ్ ఒకప్పుడు ‘మిస్టర్ మధ్యప్రదేశ్’ టైటిల్ నెగ్గిన బాడీబిల్డర్. కానీ, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా క్రీడను కొనసాగించలేక ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు. క్రీడల్లో తాను సాధించలేని విజయాన్ని పిల్లల ద్వారా చూడాలని కలలుగన్నాడు. తండ్రి ప్రేరణతో 7వ తరగతిలోనే బార్బెల్ పట్టిన జ్ఞానేశ్వరి, ఆ కలను తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది. మీరాబాయిని జ్ఞానేశ్వరి తన రోల్ మోడల్‌గా భావించింది.
పటియాలాలోని జాతీయ శిబిరంలో తొలిసారి కలిసినప్పుడు ఫోటో దిగడానికి సంకోచించిన ఆ యువతి మూడేండ్ల వ్యవధిలోనే మీరాబాయి పోటీపడే 49 కేజీల విభాగంలోనే సవాలు విసిరే స్థాయికి ఎదిగింది. 19 ఏండ్ల వయసులో మీరాబాయి ఎత్తిన 168 కేజీల జర్క్ రికార్డును జ్ఞానేశ్వరి (170 కేజీలతో) అధిగమించింది. ‘ఒకరోజు మీరా అక్కను కూడా దాటేసి ఒలింపిక్స్ వేదికపై చరిత్ర సృష్టిస్తా’ అని చాటిచెప్పిన ఆ పట్టుదలే ఆమెను ముందుకు నడిపించింది. తొలుత పవర్లిఫ్టర్గా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్‌లోకి మారిన జ్ఞానేశ్వరి తిరుగులేని విజయాలతో దూసుకెళ్త్తోంది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏకకాలంలో పసిడి పతకాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసింది.