సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : హైడ్రా తీరును హైకోర్టు తప్పుబట్టింది. కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే కేసు విషయంలో అనేకసార్లు కోర్టు ధిక్కరణలా అంటూ మండిపడింది. ఒక్క అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం హైకోర్టు చరిత్రలో ఇది తొలిసారి అంటూ వ్యాఖ్యానించింది. రంగనాథ్‌ను హైడ్రా నుంచి తప్పించాలంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించింది. హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పునకు జనం జేజేలు పలుకుతున్నారు.

గతంలో ఎన్నోసార్లు మందలించినా హైడ్రా తన తీరు మార్చుకోలేదు.. స్టేటస్కోలు కూడా పట్టించుకోకుండా చాలాచోట్ల హైడ్రా చేస్తున్న కూల్చివేతలు వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నాయన్న భావన నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. వారం రోజులుగా హైకోర్టులో లోతుకుంట విషయంలో హైడ్రా కోర్టు ధిక్కరణ వ్యవహారం నగరంలో చర్చనీయాంశమైంది. చివరకు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు హైడ్రాకు చెంపపెట్టు అయ్యింది. నగరాన్ని నమ్ముకొని దశాబ్దాలుగా జీవిస్తూ.. పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇళ్లు క్షణాల్లో నేలమట్టమై.. రాత్రికి రాత్రి సామాన్యుల కుటుంబాలు వీధినపడడానికి కారణమైన హైడ్రాకు ఈ తీర్పు సరైనదేనంటూ పలువురు పేర్కొన్నారు.
లోతుకుంట భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు , రాజ్యాంగ పరిరక్షణకు నిదర్శనమని హైడ్రాబాధితులు అభిప్రాయపడ్డారు. కూల్చివేతల సమయంలో తాము ఎంతగా అభ్యర్థించినా పట్టించుకోకపోగా మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ అధికార జులుం ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు తీర్పు చెంపపెట్టుగా వారు అభివర్ణించారు.

ముఖ్యంగా తాము న్యాయంగా ఎంతో కష్టపడి కొనుక్కున్న భూముల విషయంలో హైడ్రా ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తూ ఇబ్బందుల పాలు చేసిందని, కోర్టు మెట్లెక్కిన తమకు న్యాయం జరుగుతుందని చూసినప్పటికీ కమిషనర్ ఒంటెద్దుపోకడలు చాలా నష్టం చేశాయని పేర్కొన్నారు. హైడ్రా ప్రారంభించిన తొలినాళ్లలో చేసిన విధ్వంసం మొదలుకొని నేటివరకు బాధితులు కోకొల్లలు. తమ బాధలు చెప్పుకోవడానికి నమస్తే తెలంగాణ ప్రతిసారి వేదికైంది. రంగనాథ్ విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, అటువంటి అధికారికి న్యాయస్థానాల పై ఉన్న నిర్లక్ష్యానికి ఇది సరైన సమాధానమేనంటూ పేర్కొన్నారు.
బండ్లగూడ,జూలై 27: సీఎం రేవంత్‌రెడ్డికి కొమ్ముకాస్తు నిరుపేద ప్రజలపై బుల్డోజర్ ఎక్కిస్తూ అనేక మందిని రోడ్డు పాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గంథంగూడ విఘ్నేశ్వర కాలనీలో మూసీ బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసమే హైడ్రా ఏర్పాటు చేసుకున్నట్లు ఉందన్నారు. రేవంత్‌రెడ్డి సొంత సోదరుడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా రంగనాథ్ అటువైపు చూడలేదన్నారు. హైకోర్టు తీర్పు సంతోషకరమన్నారు.

హైడ్రా ప్రారంభించిన తొలిరోజుల్లోనే మాది లేక్‌వ్యూ అంటూ వచ్చి కట్టుకున్న ఇల్లు కూలగొట్టారు. అప్పుడు ఎంతో బతిలాడాం.మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి.. కావలసిన అన్ని రికార్డులు ఉన్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా కష్టపడి బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకున్న ఇంటిని కళ్లముందే కూల్చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తగిన శాస్తి జరిగింది. పాపం పండింది. హైదరాబాదీ ఊపిరిపీల్చుకో అన్నట్లుగా హైడ్రా కమిషనర్‌ను తొలగించాలన్న తీర్పు మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దోళ్ల భూ కబ్జాలకు పోకుండా కేవలం పేదోళ్లు, మధ్యతరగతి వారిని టార్గెట్‌గా చేసుకుని తన ప్రతాపం చూపించిన హైడ్రా రంగనాథ్‌కు ఇలాగే జరగాలి. ఆయన చేసిన దానికి ఇంకా పెద్ద శిక్షే వేయాలి.
రంగనాథ్ మా భూములపైకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా మేం కంటిమీద కునుకులేకుండా జీవించాం. మావి ప్రైవేటు భూములే అయినా అక్కడకు వచ్చి ఉన్న ఇళ్లు కూలగొట్టి, ప్లాట్లను ఆక్రమించి సున్నం చెరువు పేరుతో మాకు చాలా నష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించడమే కాకుండా నియంతలా వ్యవహరించారు. రంగనాథ్ విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్య లు, ఆయనను తీసేయాలని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఆయననే కాదు ఆయన దగ్గర ఉన్న కొందరు సిబ్బంది కూడా చాలా అరాచకంగా వ్యవహరిస్తారు. హైకోర్టు తీర్పు చూస్తుంటే ఇంకా న్యాయం బతికే ఉందనిపిస్తోంది.