సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ హాజరై జాతీయజెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించిన అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఎం.శ్రీనివాసులు, అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, నార్త్‌రేంజ్ జాయింట్ సీపీ ఎన్. శ్వేత, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైడ్రా కార్యాలయంలో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాణిగంజ్‌లోని హైడ్రా హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా జరిగాయి. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పతాకావిష్కరణ చేసి అమరులకు నివాళులర్పించారు. వర్షాల వేళ నగరంలో వరదలు ముంచెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా హైడ్రాలో పనిచేస్తూ ఉత్తమ సేవా పతకాలు అందుకున్న అధికారులతోపాటు గతంలో మహోన్నత సేవాపతకాలు సాధించిన అధికారులను హైడ్రా ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవాపతకాలకు ఇన్స్పెక్టర్లు ఎన్.నాగేశ్వర్రావు, ఎండీషంషుద్దీన్లు ఎంపిక కాగా, గతంలో మహోన్నత సేవా పతకాలు అందుకున్న ఏసీపీ తిరుమల్, ఆర్ఎఫ్ఓ జయప్రకాశ్, ఉత్తమ సేవా పతకం అందుకున్న ఏడీఎఫ్‌ఓ మోహన్‌రావును హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, అడిషనల్ కమిషన్ సుదర్శన్‌లు సత్కరించారు.

ఎస్పీడీసీఎల్లో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మింట్‌కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్పోరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమంలో సీఎండీ జితేశ్ వీ పాటిల్ హాజరై పతాకావిష్కరణ చేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలందించే దిశగా దక్షిణ డిస్కం పనిచేస్తున్నదన్నారు. ప్రతీవినియోగదారుడికి ఉత్తమ సేవలు అందించేందుకు అంకితభావం, నిజాయితీ, నిబద్దతతో పనిచేయాలని సీఎండీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సీఈలు, ఎస్ఈలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు ప్రేమతో..దివ్యాంగురాలి ప్రత్యేక కానుక
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు లోక్‌భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరుగుతున్న వేళ, అక్కడ చోటు చేసుకున్న భావోద్వేగ సన్నివేశం అందరి హృదయాలను తాకింది. జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వైష్ణవి చిన్న నాటి నుంచే జీవిత సవాళ్లతో పోరాడుతున్నది. శారీరక వైకల్యాన్ని ఆమె ఎన్నడూ తన కలలకు అడ్డంకిగా భావించలేదు. తన కాళ్లనే చేతులుగా మార్చుకుని చిత్రకళలో అసాధారణ నైపుణ్యాన్ని సాధించి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేయాలని వైష్ణవి నిర్ణయించుకుంది. గవర్నర్ చిత్రపటాన్ని తన కాలి వేళ్లతో అద్భుతంగా చిత్రీంచింది.
ఆ చిత్రాన్ని స్వయంగా గవర్నర్‌కు అందించాలన్న ఆమె కోరిక వేడుకల సందర్భంగా నెరవేరింది. గవర్నర్‌ను కలిసి తన కాలి వేళ్లతో గీసిన చిత్రాన్ని అందజేసిన వైష్ణవిని చూసి అక్కడున్న వారితోపాటు, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు భావోదేగ్వానికి లోనయ్యారు. ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి కళారంగంలో తనదైన ముద్ర వేస్తున్న వైష్ణవి సంకల్పాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా వైష్ణవిని ప్రత్యేకంగా సన్మానించి మెమెంటో, నగదు ప్రోత్సాహం అందజేశారు.

హైదరాబాద్ కలెక్టరేట్లో…
సిటీ బ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక ఆల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరవన్ పలని, జితేందర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఆర్డీవో శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్లో…
మేడ్చల్, జూన్2(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొనగా జాతీయ జెండాను కేశవరావు ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీపీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ పైజాన్ ఆహ్మద్లతో కలిసి ప్రభుత్వ సలహాదారు కేశవరావు స్వీకరించారు. ఈ వేడుకల్లో డీఆర్వో మాల తి, అధికారులు కాంతమ్మ, సూజాత, చంద్రకళ, సుగుణబాయి, సాంబశివరావు, వినోద్‌కుమార్, కిషన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పీసీబీలో బోనాల పండుగ
సిటీ బ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో బోనాల పండుగ నిర్వహించారు. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన సందర్భంగా 12 ఏండ్ల నుంచి జూన్ 2న బోర్డు ప్రాంగణంలోని అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో నాడు పీసీబీ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని.. స్వరాష్ట్రం అవతరించడంతో అప్పటి నుంచి ఏటా బోనాల పండుగ వైభవంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా పీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అంతకు ముందు పీసీబీ మెంబర్ సెక్రెటరీ రవి నాయక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈఈ రఘు, సీనియర్ సోషల్ సైంటిస్టు ప్రసన్న కుమార్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
జలమండలిలో…
సిటీ బ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జలమండలిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఈడీలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, డైరెక్టర్లు ఖాదర్, సత్యనారాయణ, ప్రభు, సీజీఎంలు, జీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.