HYDRAA | సిటీబ్యూరో, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ) : మూసీ వెంబడి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నిర్మాణాల కూల్చివేతలపై కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే మహానగరంలో విస్తరించి ఉన్న 55 కిలోమీటర్ల వెంబడి, ఇరువైపులా ఉన్న నిర్మాణాలపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో సర్వే చేయగా, ఇప్పటివరకు 13వేలకు పైగా నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. లండన్‌లోని థేమ్స్ తరహాలో మూసీని లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా… ఈ నిర్మాణాల విషయంలో ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ప్రభుత్వం మాత్రం ముందు సంబంధిత నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.
నోటీసుల్లోనే సంబంధిత నిర్మాణం వివరాలను ఎందుకు కూల్చకూడదు అనే విషయంపై వివరణ ఇచ్చే విధంగా ఫార్మాట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మూసీ వెంబడి ఉన్న నిర్మాణాలను అక్రమ, సక్రమమా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే ఓ దఫా ఎంఆర్డీసీఎల్ అధికారులు ప్రాథమిక సర్వే చేశారు. ఈ సర్వే సమయంలోనే నిర్మాణం యొక్క పూర్తి వివరాలను ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌లో పొందుపరిచినట్లు తెలిసింది.
అయితే ఇప్పుడు నోటీసుల ద్వారా సేకరించే వివరాల ప్రకారం కూల్చివేతలు ఎలా చేపట్టాలి..? పునరావాసం, పరిహారం ఏ విధంగా చెల్లించాలనే విషయాలపై ఈ నోటీసుల ద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, ముందుగా సంబంధిత నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేసిన వెంటనే నేరుగా కూల్చివేతలు చేపట్టాలనే ఎంఆర్డీసీఎల్ అధికారులను ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆదేశించినట్లు తెలిసింది. కానీ నేరుగా కూల్చివేతలతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించింది. ఈ క్రమంలోనే ముందుగా నోటీసులిచ్చి… అక్టోబర్ నెలాఖరులోగా కూల్చివేతలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.