Hyderabad | బోడుప్పల్, ఫిబ్రవరి 10: హైదరాబాద్ శివారు బోడుప్పల్లో ఓ కీచక ప్రిన్సిపల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. మేడిపల్లి వీరారెడ్డినగర్ కాలనీలోని శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్ రావు ఆ స్కూల్లో చదివే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. స్కూల్ విద్యార్థులను తన గదిలోకి పిలిపించుకుని.. వారి ప్రైవేటు పార్ట్స్‌ను టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ప్రిన్సిపల్ ఇలా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఈ విషయాలను ఇంట్లో చెప్పుకోలేక ఆవేదనకు గురయ్యామని బాధిత విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు శ్రీబ్రిలియంట్ టెక్నో హైస్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడటం దారుణమని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్కూల్ అనుమతులను వెంటనే రద్దుచేసి సంబంధిత వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, ఏఐవైఎఫ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.
ఎలాంటి తప్పు చేయలేదు: ప్రిన్సిపల్ రవీందర్ రావ్.
పరీక్షలు సమీపిస్తున్న వేళ అసభ్యకరమైన వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేస్తున్నందున తన ఆఫీసులోకి పిలిచి మందలించా.. తప్ప తాను అసభ్యకరంగా ప్రవర్తించలేదని ప్రిన్సిపాల్ రవీందర్ రావు వివరించారు. విద్యార్థులు తన కొడుకు కూతుళ్లతో సమానమని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు తనపై రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.